జగిత్యాలలో ఎంపీ కవిత రోడ్ షో.. హామీల వర్షం

By ramya neerukondaFirst Published Nov 29, 2018, 12:51 PM IST
Highlights

అన్ని రకాల పెన్షన్లు మొత్తం రూపాయలు డబుల్ అవుతాయని, పెన్షన్లకు అర్హత వయస్సును 65 ఏళ్ల నుంచి 58 ఏళ్ల కు కుదిస్తామని, నిరుద్యోగులకు భృతి గా మూడు వేల రూపాయలను అందజేస్తామని కవిత హామీ ఇచ్చారు.

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాల  మండలం జాబితా పూర్ లో  నిజామాబాద్ ఎంపీ కల్వకుంట కవిత రోడ్ షో నిర్వహించారు. కాగా.. ఆమెకు మహిళలు   మంగళ హారతులు తో  ఘనస్వాగతం పలికారు. బొట్టుపెట్టి, గంధం రాసి.. ఆమెను ఆలింగనం చేసుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు సెల్ఫీ లు తీసుకునేందుకు పోటీ పడ్డారు. మహిళలతో కలిసి కవిత బతుకమ్మ ఆడారు.

అనంతరం ఆమె రోడ్ షోలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.  టిఆర్ఎస్ ను ఆశీర్వదించాలని కోరారు. కారు గుర్తుకు ఓటు వేసి మళ్లీ కేసీఆర్ ను ముఖ్యమంత్రినీ చేయాలని, జగిత్యాల టిఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ సంజయ్ కుమార్ ను ఎమ్మెల్యేగా గెలిపించాలని కవిత కోరారు. పనిచేసేవారిని ఎన్నుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. 

టిఆర్ఎస్ ప్రభుత్వం ఎంత బాగా పనిచేస్తుందో తెలుసుకునేందుకు 24 గంటల కరెంటు సరఫరా నిదర్శనమన్నారు. అన్ని రకాల పెన్షన్లు మొత్తం రూపాయలు డబుల్ అవుతాయని, పెన్షన్లకు అర్హత వయస్సును 65 ఏళ్ల నుంచి 58 ఏళ్ల కు కుదిస్తామని, నిరుద్యోగులకు భృతి గా మూడు వేల రూపాయలను అందజేస్తామని కవిత హామీ ఇచ్చారు.  

 కాంగ్రెస్ టిడిపి సిపిఐ కోదండరాం పార్టీలను చంద్రబాబు వెనకుండి నడిపిస్తున్నాడని చెప్పారు. మన ప్రాజెక్టులను అడ్డుకునే చంద్రబాబు మనకు అవసరమా ఆలోచించాలని కోరారు. జాబితాపూర్ లో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి అనుచరుల ఆగడాలు పెరిగాయని, ఉద్యమం నుంచి వచ్చిన వాళ్ళం.. ఎంతకైనా తెగిస్తాం..ఊరుకోం అని హెచ్చరించారు. 

click me!