ఇల్లు మీరే కట్టుకోండి.. రూ.5లక్షలు ఇస్తాం.. ఎంపీ కవిత

By ramya neerukondaFirst Published Nov 28, 2018, 1:40 PM IST
Highlights

పేదలకు ఇంటి నిర్మానికి టీఆర్ఎస్ ప్రభుత్వం రూ.5లక్షల సాయం చేస్తుందని కవిత ఎన్నికల హామీ ఇచ్చారు. 

ఇల్లు కట్టుకోవడానికి స్థలం ఉన్నవాళ్లు.. మీరే సొంతగా ఇల్లు కట్టుకోండి.. ఆర్థిక సహాయం ప్రభుత్వం చేస్తుందని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. పేదలకు ఇంటి నిర్మానికి టీఆర్ఎస్ ప్రభుత్వం రూ.5లక్షల సాయం చేస్తుందని కవిత ఎన్నికల హామీ ఇచ్చారు. బుధవారం బోధన్ నియోజకవర్గంలో కవిత ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...తమ పార్టీ బోధన్ అభ్యర్థి షకీల్ ఆమీర్ కి ఓట్లు వేసి గెలిపించాల్సిందిగా కోరారు. గత ప్రభుత్వాలు ఇల్లు కట్టుకోవడానికి 70 వేలు మంజూరు చేస్తే అందులో 20 వేలు లబ్దిదారులు చెల్లించాల్సి వచ్చేదని తెలిపారు.  బ్యాంకు ద్వారా పొందిన 50 వేల రుణం కోసం బ్యాంకు వాళ్ళు దర్వాజలు తీసుకెళ్లిన పరిస్థితి ఉండేదని వివరించారు. 

ఈ పరిస్థితిని గమనించిన కేసీఆర్ పైసా చెల్లించకుండానే ఇల్లు కట్టుకునేందుకు ఆర్థిక సాయం చేస్తున్నారని తెలిపారు. దూపల్లి లో మంజూరైన 50 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కూడా త్వరితగతిన పూర్తి చేస్తామని తెలిపారు. కాంగ్రెస్, టిడిపి లు తమ కుట్రలను అమలు చేసేందుకు కూటమి కట్టి  తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, చంద్రబాబుకు తెలంగాణలో ఏమి పని అని ప్రశ్నించాలన్నారు. ఈ ఎన్నికల్లో వారిని తిరస్కరించడం ద్వారా తగిన బుద్ధి చెప్పాలని కవిత కోరారు.

ఈ ప్రచారానికి ముందు కవిత..ఎడపల్లి మండలం జానకం పేట లోని లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో తెలంగాణ రాష్ట్రం సిద్దించాలని మొక్కుకుని ఆలయం మండపంలో రూపాయి నాణెం నిలబడిందని, లక్ష్మీ నరసంహస్వామి దయ వల్ల రాష్ట్రం ఏర్పడిందని అన్నారు. ఇవాళ కూడా బంగారు తెలంగాణ నిర్మాణం జరగాలని కోరుకో గా నాణెం నిలబడిందని తెలిపారు.  ఆమె వెంట టీఆర్ఎస్ అభ్యర్థి షకీల్ అమీర్, ఇతర నాయకులు ఉన్నారు. 

click me!