ఈటల కాంగ్రెస్ లో చేరతారంటూ జోరుగా ప్రచారం... క్లారిటీ ఇచ్చిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

By Arun Kumar PFirst Published Jun 1, 2023, 10:04 AM IST
Highlights

బిజెపి నాయకుడు ఈటల రాజేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్దమయ్యారంటూ జరుగుతున్న ప్రచాారంపై స్పందిస్తూ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.  

జగిత్యాల : తెలంగాణ బిజెపిలో కీలక నాయకుడు, చేరికల కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ పార్టీ మారతారంటూ జరుగుతున్న ప్రచారంపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్పందించారు. ఈటల బిజెపిని వీడి కాంగ్రెస్ చేరతారంటూ జరుగుతున్నది తప్పుడు ప్రచారమని... ఆయన పార్టీ మారే అవకాశాలు లేవని అన్నారు. ఇతర పార్టీలకు చెందిన చాలామంది కాంగ్రెస్ లో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు కానీ ఈటల కూడా అలాంటి ఆలోచనతో వున్నారని తాను అనుకోవడం లేదని అన్నారు. ఇలా ఈటల పార్టీ మార్పుపై జీవన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. 

బిఆర్ఎస్ పార్టీనుండి సస్పెండయిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ చేరాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. అయితే వారిని బిజెపిలోకి తీసుకువచ్చేందుకు ఈటల ముమ్మరంగా ప్రయత్నించారు. పలుమార్లు జూపల్లి, పొంగులేటితో ఈటల భేటీ అయి బిజెపిలోకి ఆహ్వానించారు. అయితే బిజెపిలో చేరడానికి కొన్ని ఇబ్బందులున్నాయని చెబుతున్న జూపల్లి, పొంగులేటి తనకే రివర్స్ కౌన్సిలింగ్ ఇస్తున్నారని ఈటలే స్వయంగా తెలిపారు. దీంతో ఈటల రాజేందర్ పార్టీ మార్పుపై ప్రచారం మొదలయ్యింది.

గతంలో బిఆర్ఎస్ లో పనిచేసిన తోటి నాయకులు జూపల్లి, పొంగులేటి బాటలోనే ఈటల కూడా నడిచే అవకాశాలున్నాయని... ఈ ముగ్గురూ కాంగ్రెస్ పార్టీలో చేరతారంటూ ప్రచారం జరుగుతోంది. ఇద్దరు నేతలు ఈటలను చాలా ప్రభావితం చేసారని... అందువల్లే ఆయన రివర్స్ కౌన్సెలింగ్ వ్యాఖ్యలు చేసారంటున్నారు. ఇక బిజెపి అంత ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో ఇప్పటికే అదిష్టానంపై గుర్రుగా వున్న ఈటల పార్టీ మారతారంటూ ప్రచారం జోరందుకుంది. 

Read More  నాకే రివర్స్ కౌన్సిలింగ్ ఇస్తున్నారు: పొంగులేటి, జూపల్లి బీజేపీలో చేరికపై ఈటల

ఇక తెలంగాణ బిజెపి బండి సంజయ్, ఈటల రాజేందర్ వర్గంగా విడిపోయిందని మరో ప్రచారం జరుగుతోంది. ఇటీవల జూపల్లి, పొంగులేటితో ఈటల నేతృత్వంలోని బిజెపి బృందం భేటీ కాగా ఈ విషయం తనకు తెలయదని రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ మీడియా ముందే చెప్పాడు. దీంతో బిజెపిలో వర్గపోరు సాగుతోందని బయటపడింది. అయితే రాష్ట్రానికి చెందిన కీలక నాయకులంతా ఈటలకు మద్దతుగా నిలిస్తే అదిష్టానం మాత్రం బండి సంజయ్ పైనే నమ్మకం పెట్టుకుంది. సంజయ్ నేతృత్వంలోనే అసెంబ్లీ ఎన్నికలకు వెళతామని బిజెపి అదిష్టానం ఇప్పటికే స్పష్టం చేసింది. ఇదికూడా ఈటల పార్టీ  మారతారంటూ జరుగుతున్న ప్రచారానికి మరో కారణం. 

ఇక ఇప్పటికే టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి సైతం ఇతర పార్టీల్లోని నాయకులను కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా అందరం ఒకేపార్టీలో వుంటూ బిఆర్ఎస్ ను ఓడిద్దామని రేవంత్ సూచించారు. పార్టీలో చేరే నాయకులను కలుపుకుని పోతామని... వారికి సమున్నత స్థానం కల్పిస్తామని తెలిపాడు. దీనికి తోడు కర్ణాటక ఎన్నికల ఫలితాలు కూడా తెలంగాణలో బిజెపి జోరుతగ్గి కాంగ్రెస్ లోకి వలసలు పెరగడానికి కారణం అవుతోంది. ఈ రాజకీయ పరిణామలను చూసి ఈటల కూడా కాంగ్రెస్ చేరాలని నిర్ణయించుకున్నాడని రాజకీయ ప్రచారం జోరుగా సాగుతోంది. కానీ ఈ ప్రచారాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఖండించడం చర్చనీయాంశంగా మారింది. 

click me!