నిన్న మోదీతో సంసారం, నేడు కాంగ్రెస్ తోనా.. సిద్ధాంతాల్లేవ్: చంద్రబాబుపై తలసాని ఫైర్

By Nagaraju TFirst Published Dec 6, 2018, 2:25 PM IST
Highlights

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. చంద్రబాబు నాయుడుకు సిద్ధాంతాల అంటూ ఏమీ ఉండవంటూ ఘాటుగా విమర్శించారు. నిన్నటి వరకు సోనియా ఇటలీ దెయ్యం, రాహుల్ గాంధీ పప్పు, మెుద్దబ్బాయ్ అంటూ విమర్శించిన చంద్రబాబు నేడు ఆపార్టీతో పొత్తుపెట్టుకోవడం సిగ్గు చేటన్నారు. 

హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. చంద్రబాబు నాయుడుకు సిద్ధాంతాల అంటూ ఏమీ ఉండవంటూ ఘాటుగా విమర్శించారు. నిన్నటి వరకు సోనియా ఇటలీ దెయ్యం, రాహుల్ గాంధీ పప్పు, మెుద్దబ్బాయ్ అంటూ విమర్శించిన చంద్రబాబు నేడు ఆపార్టీతో పొత్తుపెట్టుకోవడం సిగ్గు చేటన్నారు. 

నాలుగున్నరేళ్లు మోదీతో సంసారం చేసిన చంద్రబాబు నాయుడు తమపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. పెద్దమోదీ, చిన్నమోదీ అంటూ చంద్రబాబు విమర్శలు చెయ్యడాన్ని తప్పుపబట్టారు. 

టీఆర్ఎస్ ను విమర్శిస్తున్న చంద్రబాబు నాలుగేళ్లు ఎవరితో కాపురం చేశావో గుర్తు చేసుకోవాలన్నారు. బీజేపీతో టీఆర్ఎస్ పార్టీ కలిసే ప్రసక్తే లేదని అందులో ఎలాంటి సందేహమే లేదని తేల్చిచెప్పారు తలసాని. 

ప్రజలను గందరగోళపరిచేందుకు, తెలంగాణను విచ్ఛిన్నం చేసేందుకు కొందరు వ్యక్తులు కుట్ర పన్నుతున్నారని తలసాని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని కోట్ల మంది ప్రజల జీవితాలతో ఒక వ్యక్తి ఆడుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమంది గ్రూపుగా ఏర్పడి తెలంగాణ అస్తిరపరిచేందుకు కుట్ర పన్నుతున్నారని మండిపడ్డారు. 

హైదరాబాద్‌లో రెండు లక్షల డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు నిర్మాణం అయ్యాయని, తాను చూపిస్తానని, ధైర్యముంటే రావాలని సవాల్‌ విసిరారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే వాళ్లకి పరిపాలన చేతకాదని, అభివృద్ధి చేయరని తలసాని విమర్శించారు. 

మరోవైపు లగడపాటి సర్వేలపైనా మంత్రి తలసాని ఫైర్ అయ్యారు. ఎలాంటి సర్వేలు విడుదల చేయొద్దని ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చినప్పటికీ లగడపాటి సర్వే వివరాలు వెల్లడించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

సర్వేలు చేయడం హాబీ అయితే దాన్ని ఇంటి వరకే పరిమితం చేసుకోవాలని లగడపాటికి హితవు పలికారు. లగడపాటికి ఏ అర్హత ఉందని సర్వే చేస్తారని ప్రశ్నించారు. జాతీయ సర్వే సంస్థలు చెప్పినట్లు టీఆర్ఎస్ కు 95 నుంచి 105 సీట్లు వస్తాయని తలసాని ధీమా వ్యక్తం చేశారు.

click me!