పీయూష్ గోయల్ ఎంత దుర్మార్గంగా మాట్లాడారంటే... ఇప్పుడా సన్నాసులు ఎక్కడ?: సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఫైర్

Arun Kumar P   | Asianet News
Published : Mar 24, 2022, 08:16 PM IST
పీయూష్ గోయల్ ఎంత దుర్మార్గంగా మాట్లాడారంటే... ఇప్పుడా సన్నాసులు ఎక్కడ?: సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఫైర్

సారాంశం

తెలంగాణ రైతుల నుండి యాసంగి ధాన్యం కొనుగోలు విషయంలో మరోసారి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదం రాజుకుంది. ఇప్పటికే కేంద్రంతో యుద్దానికి సిద్దమని సీఎం కేసీఆర్ ప్రకటించగా తాజాగా మంత్రులు కూడా మాటల డోసు పెంచారు. 

హైదరాబాద్: తెలంగాణ రైతులు పండించిన ధాన్యం కొనుగోలుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మద్య యుద్దవాతావరణం నెలకొంది. రాష్ట్ర రైతాంగం కోసం కేంద్రంతో తేల్చుకుంటామని చెప్పిన సీఎం కేసీఆర్ (KCR) నలుగురు మంత్రుల బృందాన్ని దేశ రాజధాని డిల్లీకి పంపారు. ఇవాళ(గురువారం)మంత్రుల బృందం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ (piyush goyal) తో భేటీ అయ్యారు. అయినప్పటికి యాసంగి ధాన్యం కొనుగోలుపై స్పష్టత రాలేదు. కానీ కేంద్రంపై రాష్ట్ర మంత్రులు, రాష్ట్రంపై కేంద్ర మంత్రుల విమర్శలు మాత్రం యదావిధిగా కొనసాగుతున్నాయి. 

కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తో సమావేశం అనంతరం ఢిల్లీ తెలంగాణ భవన్ లో తోటి మంత్రులు, టీఆర్ఎస్ ఎంపీలతో కలిసి వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (singireddy niranjanreddy) మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్రం తెలంగాణ పట్ల వ్యవహరిస్తున్న తీరు దురదృష్టకరమని మంత్రి అన్నారు. నేటి సమావేశంలో పీయూష్ గోయల్ వైఖరి అహంకారపూరితంగా వుందన్నారు. వ్యవసాయ ప్రధాన దేశంలో ఒక రాష్ట్రం పట్ల కేంద్రం ఇలాంటి వైఖరి అవాంఛనీయమన్నారు. 

''పాడిందే పాట పాసుపండ్ల దాసు అన్నట్లు కేంద్రం, ప్రధాని నరేంద్ర మోడీ  వైఖరి ఉంది. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ దుర్మార్గపూరితంగా మాట్లాడారు. మాకంటే ముందే ఆయన మీడియా వద్దకు ఆతృతగా వచ్చి తెలంగాణ ప్రభుత్వం రైతులను తప్పుదారి పట్టిస్తుందని చెప్పడం సిగ్గుచేటు'' అని మండిపడ్డారు. 

''పండిన పంట కొనుగోలు బాధ్యత అంతా కేంద్రానిదే. కేంద్రానికి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మీద అవగాహన లేదు. ధాన్యం సేకరణకు, పప్పు దినుసుల సేకరణకు తేడా కేంద్రానికి తెలియడం లేదు. కేంద్రం ఏం చెప్పినా ప్రజలు నమ్ముతారనుకోవడం అవివేకం. వడ్లను వడ్ల లాగా సేకరించాలి. గోధుమల సేకరణ అంటే గోధుమ పిండి సేకరిస్తారా? బీజేపీకే తెలివి ఉంది... ఇతరులకు లేనట్లు భావిస్తున్నారు'' అని మంత్రి సింగిరెడ్డి మండిపడ్డారు.

''దేశ రైతులను రోడ్డు మీద నిలబెట్టి దాదాపు 700 మంది చావుకు కారణమయ్యింది ఈ సిగ్గులేని బీజేపీ ప్రభుత్వం. చివరకు ప్రధాని రైతులకు చేతులెత్తి మొక్కి క్షమాపణ చెప్పింది నిజం కాదా? తెలంగాణ బీజేపీ సన్నాసులు మేం కొనిపిస్తాం... మీరు వరి వేయండి అని రైతులను రెచ్చగొట్టారు. ఇప్పుడేమో ఉలుకూ పలుకూ లేదు. కేంద్రం గురించి తెలుసుకాబట్టే తెలంగాణ రైతులకు మేము విజ్ఞప్తి చేసి 50 లక్షల ఎకరాల వరి సాగును 30 లక్షలకు తగ్గించాం'' అని మంత్రి పేర్కొన్నారు. 

''కేంద్రంలో ఉన్నది రైతు, పేదల ప్రభుత్వం కాదు... పొద్దుమాపున లెక్కలు చూసుకునే వ్యాపారాత్మక ప్రభుత్వం. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణ ప్రభుత్వం నీళ్లిచ్చి, నాణ్యమైన కరెంటు ఉచితంగా ఇచ్చి, రైతుబంధు ఇచ్చి, రైతుభీమా ఇచ్చి పంటలు సాగు చేసేలా ప్రోత్సహించింది... ఇన్ని చేసినందుకు మాది రైతు వ్యతిరేక ప్రభుత్వమా? పండిన ధాన్యం కొనాల్సిన బాధ్యత ఉన్న కేంద్రం నిరాకరించడం దుర్మార్గం. రైతుల ఆదాయం 2022 వరకు రెట్టింపు చేస్తామన్న కేంద్రం కనీసం రైతులు పండించిన పంటలను కొనకపోవడం సిగ్గుచేటు'' అని మండిపడ్డారు. 

''ఈ దేశంలో ప్రజలను అన్ని విషయాలలో కేంద్రం మోసం చేసింది. తెలంగాణ ప్రజలకు, దేశ రైతాంగానికి కేంద్రం క్షమాపణ చెప్పే పరిస్థితి త్వరలోనే వస్తుంది. మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సమాఖ్య స్ఫూర్తి లేదని, కేంద్రం వివక్ష చూపుతుందని 2013లో రైతులతో సమావేశం పెట్టారు. ఈ రోజు అదే సమాఖ్య స్ఫూర్తిని మోడీ నాయకత్వంలోని కేంద్రం దెబ్బ తీస్తున్నది. ఈ దేశ జీడీపీ పెంపుదలలో కేంద్రం విఫలమయింది. ఈ దేశంలో నిరుద్యోగం నియంత్రించడంలో కేంద్రం విఫలమయింది. ఇన్నేళ్లలో మోడీ పాలనలో ఎలాంటి నూతనత్వం లేదు'' అని వ్యవసాయ మంత్రి ఆరోపించారు. 

''ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం వైఖరి దుర్మార్గం. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన మేరకు ఈ విషయంలో ముందుకువెళ్తాం. పశుపక్షాదులకు నీళ్లు లేని చోట ఎండాకాలంలో చెరువుల అలుగులు పారిస్తున్నాం. తెలంగాణ రైతులను ఆదుకున్నది కేసీఆర్ గారా?  ఈ కేంద్రంలోని బీజేపీ మొనగాళ్లా?'' అని అడిగారు.

''తమకు అధికారం లేని చోట ఇతర పార్టీల ప్రభుత్వాలను కేంద్రంలోని బీజేపీ ఇబ్బందులు పెడుతున్నది. అబద్దాలతో బీజేపీ అధికారంలోకి వచ్చింది . వారి మేనిఫెస్టోను చూస్తేనే ఈ విషయం బోధపడుతుంది'' అని వ్యవసాయం శాఖ మంత్రి నిరంజపన్ రెడ్డి మండిపడ్డారు.


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 4 డిగ్రీల టెంపరేచర్..! ఈ 11 జిల్లాల్లో మూడ్రోజులు చలిగాలుల అల్లకల్లోలమే
Government Job : పరీక్ష లేదు, ఇంటర్వ్యూ లేదు.. కేవలం అప్లై చేస్తేచాలు జాబ్ .. తెలుగు యువతకు స్పెషల్ ఛాన్స్