కారు ఆగొద్దు, డ్రైవర్ మారొద్దు శాసనసభలో మనమే కూర్చోవాలి:కేటీఆర్

By Nagaraju TFirst Published Nov 22, 2018, 8:32 PM IST
Highlights

తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణలో కేసీఆర్‌ సీఎం అయిన తర్వాత హైదరాబాద్‌ మహానగరంలో శాంతిపూరిత వాతావరణం నెలకొందని తెలిపారు. గురువారం సాయంత్రం ఉప్పల్ టీఆర్ఎస్ అభ్యర్థి సుభాష్ రెడ్డికి మద్దతుగా రోడ్ షోలో పాల్గొన్నారు.  

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణలో కేసీఆర్‌ సీఎం అయిన తర్వాత హైదరాబాద్‌ మహానగరంలో శాంతిపూరిత వాతావరణం నెలకొందని తెలిపారు. గురువారం సాయంత్రం ఉప్పల్ టీఆర్ఎస్ అభ్యర్థి సుభాష్ రెడ్డికి మద్దతుగా రోడ్ షోలో పాల్గొన్నారు.  

టీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ మహానగరంలో నాలుగు సెకన్లు కూడా కర్ఫ్యూ విధించలేదని గుర్తు చేశారు. నాలుగున్నరేళ్లలో రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ప్రజల పక్షాన నిలిచినట్లు తెలిపారు. వివక్షపూరిత వాతావరణం లేకుండా అన్ని వర్గాలనూ సమానంగా చూశామన్నారు.

పనిచేసే ప్రభుత్వానికి పరీక్ష వచ్చినప్పుడు ప్రజలు ఆశీర్వదించాలని కేటీఆర్ కోరారు. పిల్లలకు ఆర్నెళ్లు, ఏడాదికి పరీక్షలు వస్తే తమకు ఐదేళ్లకోసారి పరీక్షలు వస్తాయని తమను ఆశీర్వదించాలని కోరారు. ఈ పరీక్షల్లో టీఆర్ఎస్ అభ్యర్థుల్ని గెలిపించాలని ప్రజలను కోరారు. 

రాష్ట్రంలో టీఆర్ఎస్ కారు ఆగొద్దు, డ్రైవర్‌ మారొద్దని అన్నారు. ఉప్పల్‌లో సుభాష్‌ రెడ్డిని గెలిపించి కారులో శాసనసభకు పంపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఉప్పల్‌ నియోజకవర్గ దిశ, దశ మార్చి పశ్చిమ హైదరాబాద్‌కు పోటీగా ఇక్కడకు ఐటీని తీసుకొస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. శిల్పారామాన్ని పూర్తిచేసి ఉప్పల్‌ ప్రజల వద్దకు మెట్రో రైలు ను తీసుకొచ్చే బాధ్యతను తాను తీసుకుంటానని భరోసా ఇచ్చారు.

టీఆర్ఎస్ ను ఓడించేందుకు విపక్షాలు కూటమిగా ఏర్పడ్డాయని విమర్శించారు. గత 50ఏళ్లుగా కాంగ్రెస్,టీడీపీ పాలన ప్రజలు చూశారని వాటిని గుర్తుకు తెచ్చుకోవాలన్నారు. కాంగ్రెస్‌, టీడీపీల పాలన బాగాలేదు కాబట్టే టీఆర్ఎస్ కి ప్రజలు అధికారం ఇచ్చారన్నారు. 

రాష్ట్రంలో కేసీఆర్‌ సుస్థిరమైన రాజకీయాలు చేస్తుంటే విపక్షాలు కులం, మతం పేరుతో రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. గత ప్రభుత్వాలు ఏనాడైనా బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేశాయా? ప్రజల ఆరోగ్యం, విద్యా విధానంపై ఏ ప్రభుత్వమైనా భరోసా కల్పించిందా? అని నిలదీశారు. హైదరాబాద్‌లో డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచి, ప్రతి ఇంటికీ తాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటామని కేటీఆర్‌ హామీ ఇచ్చారు.
 

click me!