జగన్, హరికృష్ణ ఇద్దరి విషయంలో ఒకేలా స్పందించా...కానీ...: కేటీఆర్

By Arun Kumar PFirst Published Nov 24, 2018, 6:45 PM IST
Highlights

తెలంగాణలో ప్రాంతీయ విద్వేశాలను రెచ్చగొట్టి ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ప్రతిపక్ష కూటమి విశ్వ ప్రయత్నాలు చేస్తోందని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. తాను హరికృష్ణ మృతిచెందినపుడు ఎలా స్పందించానో...వైఎస్సార్‌సిపి నాయకుడు జగన్‌పై దాడి జరిగినపుడు కూడా అలాగే స్పందించానని కేటీఆర్ గుర్తుచేశారు.  

తెలంగాణలో ప్రాంతీయ విద్వేశాలను రెచ్చగొట్టి ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ప్రతిపక్ష కూటమి విశ్వ ప్రయత్నాలు చేస్తోందని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. తాను హరికృష్ణ మృతిచెందినపుడు ఎలా స్పందించానో...వైఎస్సార్‌సిపి నాయకుడు జగన్‌పై దాడి జరిగినపుడు కూడా అలాగే స్పందించానని కేటీఆర్ గుర్తుచేశారు. కానీ జగన్‌  దాడి ఘటనపై స్పందిస్తే దాన్ని ఎపి సీఎం చంద్రబాబు తన రాజకీయాల కోసం పెద్దది చేసి చూపించాడని అన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా సీమాంధ్రులు టీఆర్ఎస్ పక్షానే నిలుస్తారని విశ్వసిస్తున్నారని కేటీఆర్ తెలిపారు. 

ఇవాళ కూకట్ పల్లిలో జరిగిన సీమాంధ్రుల ఆత్మీయ సమ్మేళనంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన హైదరాబాద్ లో సీమాంధ్రుల రక్షణకు ఎలాంటి ధోకా లేదన్నారు. తెలంగాణ వస్తే వారిని తరిమేస్తారని కొందరు తప్పుడు ప్రచారం చేశారని...కానీ టీఆర్ఎస్ పాలనలో వారు సురక్షితంగా జీవిస్తున్నారని తెలిపారు. తమ ప్రభుత్వం ఆంధ్రా, రాయలసీమ వాసులను కడుపులో పెట్టుకుని చూసుకుందని కేటీఆర్ అన్నారు.

మనుషులపై దాడులు జరిగినపుడు స్పందిస్తే కూడా చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. తాను హరికృష్ణ చనిపోయినపుడు వారి ఇంటికి వెళ్లి మరీ పార్థీవదేహాన్ని పరామర్శించానని...రెండు గంటల పాటు అక్కడే వున్నానని గుర్తుచేశారు. అలాగే వైసిపి నాయకుడు జగన్ పై దాడి జరిగినపుడు కూడా మానవత్వంతో స్పందిస్తే దాన్ని పట్టుకుని చంద్రబాబు నానా రాద్దాంతం చేశాడన్నారు. హరికృష్ణ మరణం, జగన్ దాడి రెండు ఘటనల్లో ఒకేలా స్పందించానని కేటీఆర్ స్పష్టం చేశారు.    

మహాకూటమి పేరుతో కాంగ్రెస్ తో కలిసిన టిడిపిని చూసి ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుందన్నారు. ఎన్టీఆర్ బ్రతికుండగా  ఒకసారి వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు మళ్లీ ఇప్పుడు ఈ పొత్తులతో మరోసారి వెన్నుపోటుపొడిచారని కేటీఆర్ విమర్శించారు.   

click me!