Munugode bypoll 2022: కూసుకుంట్లకు అసమ్మతి సెగ, రంగంలోకి జగదీష్ రెడ్డి

By Siva KodatiFirst Published Aug 10, 2022, 2:41 PM IST
Highlights

మునుగోడు ఉపఎన్నిక అనివార్యం కావడంతో అక్కడ విజయం సాధించడంపై టీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో అక్కడి అసమ్మతి నేతలను బుజ్జగించే పనిలో పడింది. దీనిలో భాగంగా మంత్రి జగదీశ్ రెడ్డి కీలక భేటీ నిర్వహించారు. 
 

మునుగోడు నియోజకవర్గంలో అసమ్మతిపై దృష్టి పెట్టింది టీఆర్ఎస్. సీఎం కేసీఆర్ ఆదేశాలతో అసమ్మతి నేతలతో సమావేశమయ్యారు మంత్రి జగదీశ్ రెడ్డి. జడ్‌పీటీసీ , ఎంపీటీసీ, సర్పంచ్‌లను పిలిపించుకున్నారు. విభేదాలను పక్కనపెట్టి, కలిసి పనిచేయాలని మంత్రి వారికి సూచించారు. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి ఎట్టి పరిస్ధితుల్లోనూ టికెట్ ఇవ్వొద్దని కోరుతున్నారు అసమ్మతి నేతలు. ఆయనకు టికెట్ ఇస్తే.. ఎన్నికల్లో సహకరించబోమని ఇప్పటికే సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. ఈ నేపథ్యంలోనే టీఆర్ఎస్ హైకమాండ్ అప్రమత్తమైంది. 

కాగా.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో.. అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు మునుగోడు ఉప ఎన్నిక కోసం సిద్దమవుతున్నాయి.  మునుగోడులో ఉప ఎన్నిక ఖాయమని స్పష్టం కావడంతో.. అధికార టీఆర్ఎస్‌ ఇప్పటికే ఆ నియోజకవర్గంపై దృష్టి కేంద్రీకరించింది. టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్.. మునుగోడులో సర్వేలు చేయించడంతోపాటు, ముఖ్యనేతల నుంచి అభిప్రాయాలు సేకరించినట్టుగా తెలిసింది. మరోవైపు పలువురు సీనియర్ నేతలు మునుగోడు నుంచి బరిలో దిగాలని చూస్తున్నారు. దీంతో వారు టికెట్ కోసం లాబియింగ్ ప్రయత్నాలు చేపట్టారు. 

Also Read:Munugode Bypoll 2022: మునుగోడుపై టీఆర్ఎస్ అధిష్టానం ఫోకస్.. గులాబీ పార్టీ టికెట్ ఆయనకే..?

అయితే టీఆర్ఎస్ నుంచి మునుగోడు టికెట్ ఆశిస్తున్న వారిలో ప్రధానంగా గుత్తా సుఖేందర్‌రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, బూర నర్సయ్య గౌడ్‌, కర్నె ప్రభాకర్‌ పేర్లు వినిపిస్తున్నాయి. నల్గొండ జిల్లాకు చెందిన టీఆర్‌ఎస్ నేతలు మంగళవారం సీఎంను కలిసి రెడ్డి లేదా బీసీ అభ్యర్థిని బరిలోకి దించాలని కోరినట్టుగా సమాచారం. అయితే టీఆర్ఎస్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్‌ టికెట్ మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. పార్టీ నిర్వహించిన వివిధ సర్వేల్లో ప్రజలు కూసుకుంట్ల వైపే మొగ్గు చూపినట్టుగా తెలుస్తోంది. అలాగే అభిప్రాయ సేకరణలో కూడా ఆయన పేరు ప్రధానంగా వినిపించినట్టుగా టీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ సీనియర్ నేత జగదీశ్ రెడ్డి కూడా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికే టికెట్ ఇవ్వాలని కోరినట్టుగా తెలుస్తోంది. 

ఇక, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విషయానికి వస్తే.. ఆయన తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. టీఆర్ఎస్ ఆరంభం నుంచి కేసీఆర్ వెంటే ఉన్న నేతల్లో కూసుకుంట్ల ఒకరు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొని జైలుకు కూడా వెళ్లారు. ఈ క్రమంలోనే 2014లో టీఆర్ఎస్ తరఫున మునుగోడు నుంచి పోటీ  చేసి విజయం సాధించారు. అయితే 2018 ఎన్నికల్లో మునుగోడు నుంచి బరిలో దిగిన కూసుకుంట్ల.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేతిలో దాదాపు 22,500 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయినప్పటికీ ఆయన నియోజవర్గ ప్రజలతో సన్నిహితంగా ఉంటున్నారు. మునుగోడు ఉప ఎన్నిక టికెట్ కోసం లాబియింగ్ చేస్తున్న నేతల్లో.. నియోజకవర్గంలో సానుకూలత ఎక్కువగా కూసుకుంట్లకే ఉందని పలు సర్వేల్లో తేలినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి వైపు మొగ్గు కనిపిస్తుందని టీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. అయితే ప్రస్తుతానికైతే కేసీఆర్.. రేస్‌లో ఉన్న అన్ని పేర్లను పరిశీలిస్తున్నారని, త్వరలోనే తుది నిర్ణయం తీసుకుంటారని ఆ వర్గాలు పేర్కొన్నాయి.
 

click me!