ఎన్టీఆర్, పీవీ సమాధులను కూడా కూల్చేయాలి: ఓవైసి సంచలన వ్యాఖ్యలు

By Arun Kumar PFirst Published Nov 25, 2020, 1:33 PM IST
Highlights

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అక్రమ కట్టడాలను కూల్చేస్తామంటూ చేసిన వ్యాఖ్యలపై ఓవైసి ఘాటుగా స్పందించారు. 

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి, ప్రభుత్వానికి మిత్రపక్షంగా కొనసాగుతున్న ఎంఐఎం తాజా బల్దియా ఎన్నికల్లో మాత్రం ఎదురుతిరుగుతోంది. ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న ఎంఐఎం నాయకులు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని టార్గెట్ గా చేసుకుని విమర్శలు ఎక్కుపెడుతున్నారు. తాజాగా ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసి టీఆర్ఎస్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.  

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అక్రమ కట్టడాలను కూల్చేస్తామంటూ చేసిన వ్యాఖ్యలపై ఓవైసి స్పందించారు. ఇలా అక్రమ కట్టడాలను కూల్చాలంటే ముందుగా హుస్సెన్ సాగర్ చుట్టూ వెలిసిన కట్టడాలను కూల్చాలని అక్బరుద్దీన్ సూచించారు. హుస్సెన్ సాగర్ ఒడ్డున వున్న మాజీ సీఎం ఎన్టీఆర్, మాజీ ప్రధాని పివి నరసింహారావు సమాధులను కూల్చాలన్నారు.

గతంలో 4,700 ఎకరాల విస్తీర్ణంలో వున్న హుస్సేన్‌సాగర్ జలాశయం నేడు 700 ఎకరాలు కూడా లేదన్నారు అక్బర్. కాబట్టి అక్కడి నుండే అక్రమాల కూల్చివేతలు ప్రారంభించాలని  అక్బరుద్దీన్ పేర్కొన్నారు. ఓ ఎన్నికల సభలో  ఎంఐఎంతో తమకు ఎలాంటి పొత్తు లేదని కేటీఆర్ అన్నారని... అది ముమ్మాటికీ నిజమేనన్నారు. ప్రభుత్వంతో తాము లాలూచీపడటం లేదని...అసెంబ్లీలో అధికార టీఆర్‌ఎస్ తోక ఎలా తొక్కాలో తమకు తెలుసన్నారు అక్బరుద్దీన్. 
 
ఇక గత ఎన్నికల్లో పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇస్తామని చెప్పి ఇవ్వలేదని కూడా ప్రభుత్వంపై అక్బరుద్దీన్ విమర్శించారు. ఇప్పుడు పేర్కొన్నారు. మళ్లీ ఈ ఎన్నికల్లో
మాయ మాటలు చెబుతున్నారని ప్రభుత్వంపై అక్బరుద్దీన్ మండిపడ్డారు.  

click me!