
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌తో మేఘాలయ ముఖ్యమంత్రి కొన్రాడ్ సంగ్మా సమావేశం అయ్యారు. ఈ విషయాన్ని సంగ్మా స్వయంగా ట్విట్టర్‌లో వెల్లడించారు. మేఘాలయ సీఎం సంగ్మా హైదరాబాద్ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా కొన్రాడ్ సంగ్మా తన సతీమణితోపాటు ప్రగతి భవన్ విచ్చేశారు. అక్కడే పలు కీలక అంశాలపై వీరిద్దరూ చర్చించారు. అనంతరం సంగ్మా దంపతులను కేటీఆర్‌తోపాటు ఆయన సతీమణి శైలిమ శాలువవాతో సత్కరించారు. ఓ జ్ఞాపికనూ వారికి అందజేశారు.
ప్రియ మిత్రుడు కేటీఆర్‌ను, ఆయన సతీమణిని హైదరాబాద్‌లోని వారి నివాసంలో కలుసుకోవడం చాలా సంతోషంగా ఉన్నదని మేఘాలయ సీఎం కొన్రాడ్ సంగ్మా తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్టు చేశారు. ఈ ట్వీట్‌కు కేటీఆర్ కూడా రెస్పాండ్ అయ్యారు. డియర్ కొన్రాడ్ సంగ్మా మిమ్మల్ని ఎప్పుడూ కలిసినా సంతోషమే అని ట్వీట్ చేశారు.
ప్రగతి భవన్‌లో వారు పలు వాణిజ్య సంబంధ అంశాలపై చర్చించినట్టు తెలిసింది. ఉభయ రాష్ట్రాల మధ్య సంబంధాలు, వ్యాపారాలపై ఈ సమావేశంలో చర్చించినట్టు సమాచారం.
మేఘాలయలో నేషనల్ పీపుల్స్ పార్టీకి విశేష ఆదరణ ఉన్నది. ఈ పార్టీ అధినేతనే కొన్రాడ్ సంగ్మా. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్టీ అత్యధిక సీట్లు గెలుచుకుంది. ఆ రాష్ట్రంలో మొత్తం 60 స్థానాలు ఉన్నాయి. అందులో 19 స్థానాలను నేషనల్ పీపుల్స్ పార్టీ గెలుచుకుంది. ఇటీవలే జరిగిన ఓ ఉప ఎన్నికలోనూ స్థానాన్ని కైవసం చేసుకుని అసెంబ్లీలో దాని బలాన్ని 20కు పెంచుకుంది. అసెంబ్లీ ఫలితాల అనంతరం నేషనల్ పీపుల్స్ పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుని రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ ప్రభుత్వానికి నేషనల్ పీపుల్స్ పార్టీ చీఫ్ కొన్రాడ్ సంగ్మా సారథ్యం వహిస్తున్నారు.