
మేడ్చల్ జిల్లా పేట్‌బషీరాబాద్ పరిధిలో దారుణం చోటుచేసకుంది. నిద్రిస్తున్న కార్మికులపైకి లారీ దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు మృతిచెందారు. మృతిచెందిన వారిని బిహార్ రాష్ట్రానికి చెందిన వలస కార్మికులుగా గుర్తించారు. వివరాలు.. పేట్‌బషీరాబాద్ పరిధి గోదావరి హోమ్స్‌లో నిర్మాణంలో ఉన్న భవనం ముందు బిహార్ రాష్ట్రానికి చెందిన చందన్ రామ్, కుమార్ సహరిలు నిద్రిస్తున్నారు. అయితే మంగళవారం తెల్లవారుజామున భవనం వద్దకు స్టీల్ లోడ్‌తో ఓ లారీ వచ్చింది.
అయితే అక్కడ కార్మికులు నిద్రిస్తున్న విషయం గమనించకుండా డ్రైవర్.. లారీని వెనక్కి పోనిచ్చారు. దీంతో లారీ చక్రాలు అక్కడ నిద్రిస్తున్న కార్మికుల పై నుంచి వెళ్లాయి. దీంతో చందన్ రామ్, కుమార్‌లు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. కార్మికుల మృతదేహాలను పోస్టుమార్టమ్ నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఇక, ఈ ఘటనపై కేసు సమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇదిలా ఉంటే.. సోమవారం తెల్లవారుజామున ట్యాంక్ బండ్‌పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ పోలీస్ ఇన్‌స్పెక్టర్ గాయపడ్డాడు. కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముషీరాబాద్ ఇన్‌స్పెక్టర్ ఇ. జహంగీర్ యాదవ్ ఆదివారం రాత్రి విధుల్లో ఉండగా అర్ధరాత్రి 1.50 గంటల ప్రాంతంలో పెట్రోలింగ్ కోసం ట్యాంక్ బండ్ వద్దకు చేరుకున్నారు. డ్రైవర్ వాహనాన్ని రోడ్డు పక్కన నిలిపివేశాడు. ఈ క్రమంలోనే ఇన్‌స్పెక్టర్ ఏదో తనిఖీ చేయడానికి రోడ్డు దాటుతుండగా.. రాణిగంజ్ నుండి అంబేద్కర్ విగ్రహం క్రాస్‌రోడ్ వైపు వస్తున్న BMW కారు అతన్ని ఢీకొట్టింది. దీంతో ఇన్‌స్పెక్టర్‌కు గాయాలయ్యాయి.
ఇక, కారు నడుపుతున్న వ్యక్తిని ఆసిఫ్‌నగర్‌కు చెందిన మీర్ ఉస్మాన్ అలీగా గుర్తించారు. అతడు సికింద్రాబాద్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొని స్నేహితుడితో కలిసి ఇంటికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. నిందితుడిపై కేసు నమోదు చేసిన వాహనాన్ని సీజ్ చేసినట్టుగా పోలీసులు తెలిపారు. నిందితుడు మద్యం సేవించలేదని తేలిందన్నారు. ఇక, ప్రస్తుతం గాయపడిన పోలీసు ఇన్‌స్పెక్టర్‌కు ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతుంది.