అమృతకు చిల్లిగవ్వ దక్కొద్దు: ప్రణయ్ హత్య కేసు నిందితుడు మారుతీరావు

By telugu teamFirst Published Jun 13, 2019, 7:43 AM IST
Highlights

కూతురంటే వల్లమాలిన ప్రేమ గల మారుతీరావుకు ఆమె కులాంతర వివాహం చేసుకోవడంతో పరువు పోయిందని మారుతీరావు భావించాడు. తన కూతురు రిసెప్షన్‌ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేయడంతో అతనిలో ఆగ్రహం మిన్ను ముట్టింది.

నల్లగొండ: కులాంతర వివాహం చేసుకున్న తన కూతురు అమృత వర్షిణికి చిల్లిగవ్వ కూడా దక్కకూడదని ప్రణయ్ హత్య కేసులో నిందితుడైన తండ్రి మారుతీ రావు నిర్ణయం తీసుకున్నాడు. ఆ మేరకు వీలునామా కూడా రాసినట్లు పోలీసులు దాఖలు చేసిన చార్జిషీట్ ను బట్టి తెలుస్తోంది. తన కూతురు అమృతను పెళ్లి చేసుకున్న ప్రణయ్ ను హత్య చేయించడానికి పక్కా ప్లాన్ వేసినట్లు కూడా వారు చార్జిషిట్ లో పేర్కొన్నారు. 

కూతురంటే వల్లమాలిన ప్రేమ గల మారుతీరావుకు ఆమె కులాంతర వివాహం చేసుకోవడంతో పరువు పోయిందని మారుతీరావు భావించాడు. తన కూతురు రిసెప్షన్‌ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేయడంతో అతనిలో ఆగ్రహం మిన్ను ముట్టింది. ఆమెపై ప్రతీకారం తీర్చుకోవాలని పథకం రచించి అమలు చేశాడు. 

కూతురికి ఆస్తి దక్కకూడదని, ఆమె భర్త కూడా ఉండకూడదని మారుతీరావు నిర్ణయించుకున్నాడు. రూ.కోటి సుపారీ ఇచ్చి  ప్రణయ్‌ని హత్య చేయించాడు. సంచలనం సృష్టించిన అమృత భర్త ప్రణయ్‌ హత్య కేసులో నల్లగొండ పోలీసులు దాఖలు చేసిన చార్జిషీట్‌లో విస్తుగొలిపే విషయాలు వెల్లడయ్యాయి.

ప్రణయ్‌ హత్యకు మాజీ ఐఎస్ఐ తీవ్రవాదులతో మారుతీరావు కోటి రూపాయలకు డీల్‌ కుదుర్చుకున్నాడని పోలీసులు అభియోగం మోపారు.నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో గత సెప్టెంబరు 14న జరిగిన ప్రణయ్‌ హత్య కేసును తొమ్మిది నెలలపాటు విచారించిన తర్వాత బుధవారం చార్జిషీట్‌ దాఖలు చేశారు. 

ప్రణయ్ హత్యకు మిర్యాలగూడలోని కిరాయి ముఠాలతో సంప్రదించినా ఫలితం లభించలేదని, దాంతో మిత్రుడు కరీం ద్వారా నల్లగొండలోని ఐఎస్ఐ మాజీ తీవ్రవాదులు బారీ, అస్గర్‌అలీలను సంప్రదించాడని చార్జీషిట్ లో తెలిపారు. అస్గర్‌అలీకి రాజమండ్రి జైల్లో కలిసిన బిహార్‌ వాసి సుభాష్ శర్మ గుర్తొచ్చాడని, దీంతో కరీంను పిలిచి హత్యకు ప్రణాళిక రూపొందిస్తానని చెప్పాడని అన్నారు. 

చార్జిషీట్ లోని వివరాల ప్రకారం.... రూ.కోటి ఇస్తే ఈ హత్య పథకాన్ని పూర్తి చేస్తానని కరీం అంగీకరించాడు. ఆ తర్వాత సుభాష్ శర్మకు ప్రణయ్‌ హత్య గురించి వివరించి రూ.15లక్షలు చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకుని బిహార్‌ నుంచి రప్పించారు. అతను మిర్యాలగూడలో కరీం ఇంట్లో షెల్టర్‌ తీసుకున్నాడు. 45 రోజుల పాటు మకాం వేసిన సుభాష్ శర్మ పలుమార్లు ప్రణయ్‌ హత్య కోసం రెక్కీ నిర్వహించాడు. 

రెండు సార్లు ప్రణయ్‌ హత్యాప్రయత్నం విఫలమైంది. మూడోసారి అమృతవర్షిణి ఆస్పత్రికి వెళ్లిన సమయంలో మారుతీరావు ఇచ్చిన పక్కా సమాచారంతో సుభాష్ శర్మ ప్రణయ్‌ని హత్య చేశాడు. బారీ, అస్గర్‌అలీ సంఘటనా స్థలానికి సమీపంలోనే ఉండి హత్యను పర్యవేక్షించారు.
 
ప్రణయ్‌ హత్య కేసులో మారుతీరావుకు ఉరి శిక్షే సరైందని, అందుకు సంబంధించిన పూర్తి ఆధారాలు సమర్పిస్తున్నామని పోలీసులు చార్జిషీట్‌లో అన్నారు. మొత్తం 120 మందిని విచారించిన పోలీసులు 1600 పేజీల్లో చార్జిషీట్‌ నివేదికను పొందుపర్చి హత్యలో ఎనిమిది మంది నిందితుల పాత్ర ఉందని నిర్ధారణకు వచ్చారు.

click me!