ఐటీ అధికార్లు ఫోన్లు చేయలేదు: టర్కీ నుండి తిరిగి వచ్చిన మంత్రి మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి

By narsimha lodeFirst Published Nov 24, 2022, 10:11 AM IST
Highlights

తనకు  ఏ  ఐటీ  అధికారి  ఫోన్  చేయలేదని  తెలంగాణ మంత్రి  మల్లారెడ్డి అల్లుడు  రాజశేఖర్ రెడ్డి  చెప్పారు.

హైదరాబాద్: తనకు  ఏ  ఐటీ  అధికారి  ఫోన్ చేయలేదని  తెలంగాణ  మంత్రి  మల్లారెడ్డి  అల్లుడు  రాజశేఖర్  రెడ్డి  చెప్పారు.  కుటుంబసభ్యులతో  విహారయాత్రకు వెళ్లిన  రాజశేఖర్  రెడ్డి  గురువారంనాడు   ఉదయం  హైద్రాబాద్ కు  చేరుకున్నారు.  ఇవాళ ఉదయం  శంషాబాద్  ఎయిర్  పోర్టులో  రాజశేఖర్  రెడ్డి  మీడియాతో  మాట్లాడారు.  మంత్రి మల్లారెడ్డితో  పాటు  ఆయన  కుటుంబసభ్యులు , బంధువుల  ఇళ్లలో  ఐటీ  అధికారులు  సోదాలు  నిర్వహించారు.  రెండు రోజులుగా  ఐటీ  అధికారులు సోదాలు  చేశారు. ఇవాళ  ఉదయం  ఐటీ సోదాలు ముగిశాయి. విచారణకు  రావాలని  మంత్రి మల్లారెడ్డిని  ఐటీ  అధికారులు  ఆదేశించిన  విషయం  తెలిసిందే.

తనది  సాధారణ ఇల్లు  మాత్రమేనని  రాజశేఖర్  రెడ్డి  చెప్పారు. ఎలాంటి  ఎలక్ట్రిక్  లాకర్లు  లేవన్నారు.  తాను  ఇంటికి వెళ్తే  కానీ  పూర్తి  వివరాలు తెలియవని ఆయన  చెప్పారు. తమ  వాళ్లకు  ఫోన్లు  చేసినా  కూడా  స్పందించడం  లేదన్నారు. తమ వాళ్ల  ఫోన్లు  ఐటీ  అధికారుల  వద్ద  ఉన్నాయేమోనని  ఆయన  అనుమానం  వ్యక్తం  చేశారు. అందుకే  తాను  ఫోన్లు  చేస్తే  ఎవరూ  స్పందించడం  లేదన్నారు. తాను  40  ఏళ్లుగా  బిజినెస్  చేస్తున్నట్టుగా  రాజశేఖర్  రెడ్డి  చెప్పారు. ఇప్పటికే  మూడు దఫాలు  ఐటీ  దాడులు  జరిగినట్టుగా  రాజశేఖర్  రెడ్డి  తెలిపారు.  ఐటీ  దాడులు  తమకు  కొత్తకాదని  ఆయన  చెప్పారు. మీడియా మిత్రుల ద్వారానే  తనకు  ఐటీ సోదాల  విషయం తెలిసిందన్నారు. తన  ఇంట్లో  నగదు  దొరికిన  విషయం తనకు  తెలియదని  చెప్పారు . తాను  ఇంటికి  వెళ్లిన  తర్వాతే  ఏ  విషయమైనా  స్పందిస్తానని  ఆయన  చెప్పారు. మర్రి  రాజశేఖర్  రెడ్డి  నివాసంలో  సుమారు  రూ. 3 కోట్లను  స్వాధీనం చేసుకున్నామని  ఐటీ  అధికారులు తెలిపారు. 
 

click me!