నేనేం దాచుకోలేదు, రేవంత్ రెడ్డి పేరు చెప్పా: విహెచ్ కు మల్లు రవి కౌంటర్

By telugu teamFirst Published Dec 26, 2020, 4:44 PM IST
Highlights

రేవంత్ రెడ్డిపై, మాణిక్యం ఠాగూర్ మీదతమ పార్టీ సీనియర్ నేత విహెచ్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెసు నేత మల్లు రవి స్పందించారు. తానేమీ దాచుకోలేదని, తాను రేవంత్ రెడ్డి పేరును బహిరంగంగానే చెప్పానని మల్లు రవి అన్నారు.

హైదరాబాద్: మాల్కాజిగిరి ఎంపీ, తెలంగాణ పీసీసీ వర్కంగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి విషయంలో కాంగ్రెసు సీనియర్ నేత వి. హనుమంతరావు చేసిన వ్యాఖ్యలకు పార్టీ నేత మల్లు రవి కౌంటర్ ఇచ్చారు. తమ ప్రాంతానికి చెందిన రేవంత్ రెడ్డి పార్టీ ఎంపీగా, వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారని, రేవంత్ రెడ్డికి తెలంగాణ పసిసి పదవి ఇవ్వాలని తాను బహిరంగంగానే మీడియాతో చెప్పానని ఆయన స్పష్టం చేశారు 

తెలంగాణ కాంగ్రెసు వ్యవహారాల ఇంచార్జీ మాణిక్యం ఠాగూర్ మీద విహెచ్ చేసిన విమర్శలను ఆయన ఖండించారు. మాణిక్యం ఠాగూర్ డబ్బులకు అమ్ముడుపోయారని విహెచ్ విమర్శించిన విషయం తెలిసిందే. దానిపై మల్లు రవి తీవ్రంగా మండిపడ్డారు విహెచ్ వ్యాఖ్యలపై ఆయన శనివారంనాడు స్పందించారు. 

వైద్య విద్యలో ఉన్నత చదువులు చదివి సమాజాంలో మార్పు కోసం రాజకీయాల్లోకి వచ్చానని, ఎవరికీ తాను చెంచాగిరీ చేయాల్సిన అవసరం లేదని మల్లు రవి అన్నారు. 

తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవి విషయం తెలంగాణ కాంగ్రెసు నేతల మధ్య చిచ్చు పెట్టింది. రేవంత్ రెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవి ఖరారైందని వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో విహెచ్ తీవ్రంగా స్పందించారు. రేవంత్ రెడ్డిపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు 

రేవంత్ రెడ్డికి తెలంగాణ పీసీసీ పదవి ఇస్తే తాను పార్టీలో ఉండబోనని విహెచ్ అన్నారు. తనతో పాటు ఇతర నాయకులు కూడా వారి దారి వారు చూసుకుంటారని ఆయన అన్నారు. తెలంగాణ వ్యతిరేకి రేవంత్ రెడ్డికి టీపీసీసీ పదవి ఇవ్వడాన్ని తాను వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. 

రేవంత్ రెడ్డికే కాదు తనకు కూడా ప్రజల్లో క్రేజ్ ఉందని చెప్పారు రాష్ట్రంలో బిజెపి పుంజుకుంటున్న స్థితిలో ఆర్ఎస్ఎస్ వ్యక్తికి పిసీసీ పదవి ఇవ్వడమేమిటని ఆయన ప్రశ్నించారు ఆర్ఎస్ఎస్ వ్యక్తి కింద తాను పనిచేయబోనని చెప్పారు.

రేవంత్ రెడ్డికి అన్ని డబ్బులు ఎలా వచ్చాయో తేల్చాలని తాను సీబీఐకి లేఖ రాయనున్నట్లు ఆయన తెలిపారు. రెడ్లకే పీసీసీ పదవి ఇవ్వాలని అనుకుంటే ఒరిజినల్ రెడ్డికి ఇవ్వాలని ఆయన అన్నారు. 

click me!