రాహుల్, బాబు సభ..ఖమ్మం నుంచే కూటమి అడుగులు: భట్టి విక్రమార్క

By sivanagaprasad kodatiFirst Published Nov 26, 2018, 11:40 AM IST
Highlights

దేశ రాజకీయాల్లో బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఏర్పడుతున్న సెక్యులర్ కూటమి మొదటి సభకు ఖమ్మం వేదిక కావడం సంతోషించదగ్గ పరిణామామన్నారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క.

దేశ రాజకీయాల్లో బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఏర్పడుతున్న సెక్యులర్ కూటమి మొదటి సభకు ఖమ్మం వేదిక కావడం సంతోషించదగ్గ పరిణామామన్నారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క. ఈ నెల 28న జరగనున్న రాహుల్, చంద్రబాబు సభకు సంబంధించి ఆయన టీటీడీపీ నేత నామా నాగేశ్వరరావుతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మతతత్వ నేతల చేతుల్లోకి వెళ్లి దేశంలోని వ్యవస్థలన్నీ భ్రష్టుపట్టిపోయాయని.. తిరిగి జాతి నిర్మాణం చేయడానికి సెక్యులర్ పార్టీలన్నీ ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేశారని విక్రమార్క మండిపడ్డారు.

ఖమ్మం జిల్లా ప్రజలు రాజకీయంగా చైతన్యవంతులని.. ఈ నేలలో అన్ని రకాల భావజాలాలున్నాయని ఆయన అన్నారు. నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ఇద్దరు కీలకనేతలు తొలిసారి ఒకే వేదిక మీదకు రావడం శుభపరిణామమన్నారు.

రానున్న ఎన్నికల్లో తెలంగాణలో మహాకూటమిదే విజయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఖమ్మం సభ కోసం తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా ప్రజలు, రాజకీయ పార్టీలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయన్నారు. సభకు ప్రజలు, ప్రజాసంఘాల నేతలు పెద్దసంఖ్యలో పాల్గొనాలని నాగేశ్వరరావు విజ్ఙప్తి చేశారు.

click me!