
Munugodu bypoll: మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగి వేడేక్కాయి. ఎలాగైనా ఈ స్థానం నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. దూకుడుగా ముందుకు సాగుతున్న బీజేపీ ఇక్కడ విజయం సాధించాలని ప్రణాళికలు సిద్దం చేసింది. అయితే, మునుగోడు ఉప ఎన్నిక గెలుపుతో ప్రతిపక్షాల దూకుడుకు చెక్ పెట్టాలని అధికార పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) భావిస్తోంది. ఈ క్రమంలోనే ఆయా పార్టీలు వాటి సమీకరణాలతో ముందుకు సాగుతున్నాయి. ఒకరిపై ఒకరు విమర్శలు, ఆరోపణలు చేసుకుంటూ రాజకీయాలను హీటెక్కిస్తున్నారు.
ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ సర్కారు పేదలను దోచుకుంటున్నదని బీజేపీ నాయకులు, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కే తారక రామారావు (కేటీఆర్) మర్యాదను పాటించాలనీ, ప్రధాని నరేంద్ర మోడీపై వ్యాఖ్యలు చేసే ముందు తన స్థాయిని గుర్తుంచుకోవాలని ఆయన సూచించారు. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బుధవారం చౌటుప్పల్ మండలం తూఫ్రాన్‌పేటలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఆయన వెంట ఈటల రాజేందర్ తో పాటు వివేక్ వెంకటస్వామి సహా పలువురు బీజేపీ నాయకులు, పార్టీ కార్యకర్తలు ఉన్నారు.
మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో రాజకీయ నేతల వ్యాఖ్యలు, ప్రవర్తనను తెలంగాణ సమాజం నిశితంగా గమనిస్తోందని ఈటల రాజేందర్ అన్నారు. నిరుత్సాహంలో ఉన్న కేటీఆర్, ఇతర టీఆర్‌ఎస్ నేతలు ప్రధాని నరేంద్ర మోడీ, రాజ్‌గోపాల్‌పై అర్థం లేని వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అధికార పార్టీ నాయకులు భయాందోళనలకు గురవుతున్నారని పేర్కొన్న ఈటల.. ప్రజల మద్దతుతో మునుగోడులో కమలం వికసిస్తుందని నొక్కి చెప్పారు. మునుగోడులో తన సతీమణి జమున ప్రచారం చేయడంపై టీఆర్‌ఎస్ నేతల అభ్యంతరాలను బుట్టదాఖలు చేసిన ఈటల.. ఆమె ప్రజల మనిషనీ, భూమి పుత్రిక అని పేర్కొన్నారు. ఉప ఎన్నికలో అన్ని పార్టీలు స్వేచ్ఛగా, ప్రశాంత వాతావరణంలో ప్రచారం చేసేందుకు వీలు కల్పించాలని ఎన్నికల అధికారులు, పోలీసులను ఆయన కోరారు.
టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచిన ఈటల రాజేందర్.. రైతు బంధ పథకం, కౌలు రైతులు అంశాలను ప్రస్తావించారు. రియల్ ఎస్టేట్ రైతులకు రైతుబంధు ఇస్తున్నారనీ, కౌలు రైతులకు ఎందుకు నిరాకరిస్తున్నారని సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు. పేద దళిత కుటుంబాలను పట్టించుకోకుండా ప్రభుత్వం ధనవంతులకు దళిత బంధు సాయం అందిస్తోందని ఆరోపించారు. అలాగే, గిరిజనుల బంధు అనేది కేసీఆర్ రాజకీయ జిమ్మిక్కు గిరిజనులను హెచ్చరించారు. కళ్యాణలక్ష్మి, రైతు బంధు, ఆసరా పింఛన్ల కోసం సీఎం కేసీఆర్ రూ.25 వేల కోట్లు వెచ్చిస్తున్నారని, ప్రభుత్వం ప్రతి వంద మందికి బెల్టు షాపు పెట్టి రూ.45 వేల కోట్ల ప్రజాధనాన్ని దోచుకుంటోందని విమర్శించారు. కాగా, చౌటుప్పల్ మండలంలో రాజగోపాల్ రెడ్డి సతీమణి శోభ పార్టీ మహిళా నేతలతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఆమె ఇంటింటికీ వెళ్లి బీజేపీకి ప్రజల మద్దతును కోరారు.
కాగా, కాంగ్రెస్ పార్టీకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగుతోంది. కాంగ్రెస్ ను వీడిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ నాయకులు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కుమార్తె పాల్వాయి స్రవంతిని బరిలోకి దింపింది. అధికార పార్టీ టీఆర్ఎస్ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పోటీ చేస్తున్నారు.