తెలంగాణ సీఎం కేసీఆర్ తో ‘లోక్ మత్’ మీడియా సంస్థల చైర్మన్, విజయ్ దర్డా భేటీ.. జాతీయ రాజకీయాల్లోకి ఆహ్వానం..

By SumaBala BukkaFirst Published Sep 30, 2022, 1:20 PM IST
Highlights

‘కేసీఆర్’ లాంటి ప్రత్యామ్న్యాయ నాయకత్వం కోసం దేశ ప్రజలు ఎదురుచూస్తున్నారని ‘లోక్ మత్’ మీడియా సంస్థల చైర్మన్ విజయ్ దర్డా అన్నారు. 

హైదరాబాద్ : మహారాష్ట్రకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు,  రాజ్యసభ మాజీ సీనియర్ సభ్యుడు, ‘లోక్ మత్’ మీడియా సంస్థల చైర్మన్, విజయ్ దర్డా గురువారం నాడు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుతో సమావేశమయ్యారు. దేశానికే ఆదర్శంగా తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి తీరుతెన్నులతో పాటు, పలు జాతీయ అంశాలు, దేశ రాజకీయాలపై ఈ సందర్భంగా, సిఎం కెసిఆర్ తో దర్డా చర్చించారు. కేంద్రంలోని బిజెపి అసంబద్ధ పాలనతో రోజు రోజుకూ అన్ని రంగాలు దిగజారిపోతున్నాయని, సామాజిక సంక్షుభిత వాతావరణం నెలకొంటున్నదని ఆయన అభిప్రాయపడ్డారు. 

దేశ ప్రతిష్టను దిగజార్చే ఇటువంటి పరిస్థితులను చక్కదిద్దే ప్రత్యామ్న్యాయ రాజకీయ నాయకత్వం దేశానికి తక్షణావసరమని చర్చల సందర్భంగా విజయ్ దర్డా స్పష్టం చేశారు. శాంతియుత పార్లమెంటరీ పంథాలో ఉద్యమాలు నిర్వహించి, సిఎం కెసిఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం గొప్ప విషయమని విజయ్ దర్దా అన్నారు. అక్కడే ఆగిపోకుండా, అనతికాలంలోనే తెలంగాణను అగ్రస్థానంలో నిలబెట్టి దేశానికే ఆదర్శవంతంగా తీర్చిదిదుతున్న తీరు అమోఘమన్నారు. 

ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ అకుంఠిత ధీక్షను, అందిస్తున్న సుపరిపాలనను ఆయన కొనియాడారు. ఇంతటి పట్టుదల, ధైర్యం, రాజనీతిజ్జత, దార్శనికత కలిగిన రాజకీయ నాయకత్వం సమకాలీన రాజకీయాల్లో తెలంగాణనుంచి ఎదగడం దేశానికి శుభ సూచకమని  అభిప్రాయపడ్డారు. సిఎం కెసిఆర్ రాజకీయ పాలనానుభవం కేవలం తెలంగాణకు మాత్రమే పరిమితం కాకుండా, దేశ ప్రజల గుణాత్మాకాభివృద్ధికి దోహదపడాల్సిన అవసరమున్నదన్నారు. ‘కేసీఆర్’ లాంటి ప్రత్యామ్న్యాయ నాయకత్వం కోసం దేశ ప్రజలు ఎదురుచూస్తున్నారని, జాతీయ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించాలని సిఎం కెసిఆర్ ను విజయ్ దర్డా ఆహ్వానించారు. 

అందుకు సిఎం కెసిఆర్ విజయ్ దర్దాకు ధన్యవాదాలు తెలిపారు. ఆయనను శాలువాతో సత్కరించి, జ్జాపికను అందచేశారు. తాను రచించిన ‘రింగ్ సైడ్’ పుస్తకాన్ని సిఎం కెసిఆర్ కు విజయ్ దర్డా ఈ సందర్భంగా అందజేశారు. దాదాపు మూడు గంటలపాటు సాగిన చర్చలు ఫలవంతంగా ముగిసాయి.

click me!