ముస్తాబాద్ లో కేటీఆర్ పర్యటన.. కేసీఆర్ ప్రభుత్వం మాటిస్తే.. నిలబెట్టుకుని తీరుతుందని హామీ...

By SumaBala BukkaFirst Published Feb 14, 2022, 2:09 PM IST
Highlights

తెలంగాణ రాష్ట్ర పట్టణ,ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ముస్తాబాద్ లో పర్యటించారు. డబుల్ బెడ్ రూం ఇళ్లను ప్రారంభించారు. కేసీఆర్ మాటిస్తే నిలబెట్టుకుంటారని.. నిదర్శనం ఇదేనని అన్నారు. 

ముస్తాబాద్ : దేశంలో ఆదర్శవంతమైన పథకాలు తెచ్చిన ఘనత సీఎం KCRదే అని మంత్రి KTR అన్నారు. దేశానికి దిక్సూచి వంటి కార్యక్రమాలు ఆయన చేపట్టారని చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ లో రెండు పడకగదుల ఇళ్లను ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ మాట్లాడారు. 

‘ఇంటింటికీ తాగునీరు, 24 గంటలు విద్యుత్ సరఫరా కేసీఆర్ దూరదృష్టితోనే సాధ్యమయ్యాయి. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు అందిస్తున్నాం. కేసీఆర్ ప్రభుత్వం మాట ఇచ్చిందంటే నిలబెట్టుకుని తీరుతుంది. త్వరలోనే పేదలందరికీ రెండు పడక గదుల ఇళ్లు పంపిణీ చేస్తాం. డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలపై అందరికీ అనుమానాలు ఉండేవి. ఎవరైనా ఇళ్ల కోసం డబ్బులు అడిగితే ఇవ్వొద్దు. ఇళ్లు రాని వాళ్లు ఉంటే బాధపడొద్దు. నాణ్యమైన ఇళ్లు ఇవ్వాలన్నదే మా సంకల్పం. 

డబుల్ బెడ్ రూం ఇళ్లు ప్రైవేట్ బిల్డర్ నిర్మిస్తే.. రూ.25లక్షలు అయ్యేవి. అంత విలువైన ఇళ్లను ఉచితంగా ఇస్తున్నాం. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ కింద రూ.8,500 కోట్లు అందజేశాం. ఆడబిడ్డలకు 11 లక్షల కేసీఆర్ కిట్లు అందించాం. కొందరు పనిలేక కేసీఆర్ మీద ఆరోపణలు చేస్తున్నారు. దేశంలో ఎక్కడైనా డబుల్ బెడ్ రూం ఇళ్లు ఉంటే చూపించాలి’ అని కేటీఆర్ సవాల్ విసిరారు. 
ఇదిలా ఉండగా, ఫిబ్రవరి 12న కూడా కేటీఆర్ ఇదే విషయాన్ని చెప్పుకొచ్చారు. 

తెలంగాణ రాష్ట్రం నేడు అభివృద్ధి పథంలో ముందుకు దూసుకువెడుతోందని దీనికి కేసీఆర్ నాయకత్వమే కారణమంటూ రాష్ట్ర పట్టణాభివృధ్ది, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. దీనికి మహాత్మాగాంధీ చెందిన వ్యాఖ్యలను జోడించారు. 

‘మొదట వారు మిమ్మల్ని విస్మరిస్తారు..
తరువాత మిమ్మల్ని చూసి నవ్వుతారు..
ఆ తరువాత మీతో కయ్యానికి కాలు దువ్వుతారు..
ఆ తరువాత మీరు విజయం సాధిస్తారు..’ మహాత్మాగాంధీ..

ఇలాగే మే 2001లో ‘కేంద్రాన్నిదారికి తెస్తాం.. తెలంగాణ సాధిస్తాం’ అన్న కేసీఆర్ గారి audacious statementను ఎంతోమంది ప్రతిపక్ష నాయకులు వెక్కిరించారు. ఎద్దేవా చేశారు. విరుచుకుపడ్డారు. కానీ నేడు దార్శనికుడైన కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ సగర్వంగా తలెత్తుకుని నిలబడింది... అంటూ 2001నాటి ఈనాడు పేపర్ క్లిప్ ను షేర్ చేశారు కేటీఆర్.  

2001 మే 17న కరీంనగర్ లో జరిగిన సింహగర్జనలో కేసీఆర్ కేంద్రం మీద విరుచుకుపడి ప్రత్యేక తెలంగాణ సాధన గురించి ప్రస్తావించినప్పటి సంగతిని కేటీఆర్ నిన్నటి జనగామ బహిరంగ సభలో ప్రకటనతో గుర్తు చేసుకున్నారు.

click me!