
తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి బృందం శనివారం అమెరికా బయలుదేరి వెళ్లింది. తెలంగాణ రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు తీసుకువచ్చే ప్రయత్నంలో భాగంగా కేటీఆర్ బృందం పర్యటన సాగనుంది. దాదాపు 10 రోజుల పాటు అమెరికాలో పర్యటించనున్న కేటీఆర్ బృందం.. ప్రపంచ ప్రఖ్యాత కంపెనీల సీఈఓలు, పారిశ్రామికవేత్తలతో సమావేశం కానుంది. ఇక, కేటీఆర్ టీమ్ అమెరికాలోని లాస్ ఏంజిల్స్, శాన్ డియాగో, సానో హోజే, బోస్టన్, న్యూయార్క్.. నగరాల్లో పర్యటించనుంది.
ఈ పర్యటనలో ప్రపంచంలోని అత్యంత ప్రతిష్ఠాత్మకమైన పలు ఐటీ, ఎలక్ట్రానిక్స్ ఫుడ్ ప్రాసెసింగ్, లైఫ్ సైన్సెస్, ఫార్మా రంగాల కంపెనీలతో సమావేశమవుతారు. తెలంగాణలో పరిశ్రమల పెట్టుబడులకు ఉన్న అనుకూలతలను, రాష్ట్ర ప్రభుత్వ విధానాలను కేటీఆర్ నేతృత్వంలోని బృందం వారికి వివరించనుంది. గతంలో అమెరికాలో పర్యటించి పెద్దఎత్తున పెట్టుబడులను తెలంగాణకు తీసుకువచ్చిన కేటీఆర్ ఈ పర్యటన ద్వారా మరిన్ని పెట్టుబడులను తెలంగాణకు తీసుకు వచ్చే అవకాశం ఉందని ఐటీ, పరిశ్రమ శాఖల వర్గాలు చెబుతున్నాయి.
ఇక, అమెరికా పర్యటనలో భాగంగా అక్కడి తెలంగాణ వాసులతో మంత్రి కేటీఆర్ సమావేశం కానున్నారు. అక్కడి సంఘాలు ఏర్పాటు చేసే ప్రత్యేక సమావేశాల్లో పాల్గొననున్న కేటీఆర్.. రాష్ట్ర అభివృద్దిలో వారి సహకారాన్ని కోరనున్నారు. ప్రభుత్వ పథకాల అమలులో ఎన్నారైలను భాగస్వామ్యం చేసేందుకు ప్రభుత్వం ఈ పర్యటనను ఉపయోగించుకునే అవకాశం ఉంది.
ఇక, కేటీఆర్‌తో పాటు యూఎస్‌కు వెళ్లిన బృందంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, పరిశ్రమలు ఐటీ శాఖకు చెందిన పలు విభాగాల డైరెక్టర్లు ఉన్నారు.