
బీజేపీ, కాంగ్రెస్‌లపై తెలంగాణ మంత్రి కేటీఆర్ మరోమారు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్‌కు కాలం చెల్లిందని విమర్శించారు. ఒక్క ఛాన్స్ అని రాహుల్ గాంధీ అడుగుతున్నారని.. ప్రజలు ఇప్పటికే కాంగ్రెస్‌కు 50 ఏళ్లు అధికారం ఇచ్చారని.. అన్నేళ్లు ఏమీ చేయలేని వాళ్లు ఇప్పుడేం చేస్తారని ప్రశ్నించారు. కొల్లాపూర్‌లో సింగోటం నుంచి గ్రావిటీ ద్వారా తీసుకెళ్లే రూ.147 కోట్ల పనులకు కేటీఆర్ శంకుస్థాపన చేస్తారు. దీంతోపాటు కొల్లాపూర్ పట్టణంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేపట్టారు.
అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌కు చరిత్ర తప్ప భవిష్యత్తు లేదని విమర్శించారు. రాహుల్ గాంధీని గంటల తరబడి ఈడీ ఆఫీస్‌లో కూర్చోబెట్టినా అడిగేవాడు లేడని అన్నారు. బీజేపీకి మత పిచ్చి తప్ప మరోటి లేదని మండిపడ్డారు. దేశాన్ని రావణకాష్టంగా మార్చిందని విమర్శించారు. మోదీ అధికారంలోకి రాక ముందు సిలిండర్ రూ. 400 ఉండేదని.. ఇప్పుడు సిలిండర్ ధర రూ. 1,050 అయిందని.. మరి ఎవరు అసమర్ధుడని ప్రశ్నించారు. తంబాకు తినడం తప్ప బండి సంజయ్‌కు ఏమి తెలియదని విమర్శించారు.
ఇక, కొల్లాపూర్ నుంచి బయలుదేరిన కేటీఆర్.. కాసేపట్లో నాగర్ కర్నూలు చేరుకోనున్నారు. అక్కడ మినీ టాంక్ బండ్, మిషన్ భగీరథ పైలాన్, ఆడిటోరియం, వెజ్-నాన్ వెజ్ మార్కెట్‌కు శంకుస్థాపన చేస్తారు. నూతనంగా నిర్మించిన మున్సిపల్ బిల్డింగ్ను ప్రారంభిస్తారు. బిజినేపల్లిలో ఎంపీడీఓ భవనం ప్రారంభిస్తారు. శాయిన్ పల్లి రూ.76 కోట్లతో నిర్మించనున్న మార్కండేయ రిజర్వాయర్‌కు శంకుస్థాపన చేస్తారు. అనంతరం బిజినేపల్లి మండల కేంద్రంలో జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొంటారు.