లుచ్ఛాగాళ్లు: రాహుల్ గాంధీపై కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు

By pratap reddyFirst Published Aug 16, 2018, 8:35 AM IST
Highlights

ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీపై తెలంగాణ మంత్రి కెటి రామారావు విరుచుకుపడ్డారు. రాహుల్ గాంధీని కొత్త బిచ్చగాడిగా అభివర్ణించారు. కాంగ్రెసువాళ్లను లుచ్చాగాళ్లని తిట్టిపోశారు. 

కరీంనగర్: ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీపై తెలంగాణ మంత్రి కెటి రామారావు విరుచుకుపడ్డారు. రాహుల్ గాంధీని కొత్త బిచ్చగాడిగా అభివర్ణించారు. కాంగ్రెసువాళ్లను లుచ్చాగాళ్లని తిట్టిపోశారు. నాలుగేళ్లుగా రాని కొత్త బిచ్చగాళ్లు ఇప్పుడు మళ్లీ ఓట్ల కోసం వచ్చారని, బిచ్చగాళ్లు మంచోళ్లేనని, కాంగ్రెసోళ్లే లుచ్ఛాగాళ్లని ఆయన అన్నారు. 

కాంగ్రెసు పాలనలో అన్ని రంగాల్లో అవినీతికి పాల్పడ్డారని, చివరకు పంచభూతాలను కూడా పంచభక్ష పరమాన్నాలుగా భోంచేసిన చరిత్ర కాంగ్రెసుదని అన్నారు. నిన్న రాహుల్‌గాంధీ పక్కన కూర్చున్నోళ్లలో సగం మంది సీబీఐ కేసులతో బెయిల్‌ మీద ఉన్నోళ్లేనని అన్నారు. 

ఉత్తమ్‌ ఎన్నికల సమయంలో మూడు కోట్లతో అడ్డంగా దొరికిపోయాడని, చివరికి రాహుల్‌గాంధీ కూడా బెయిల్‌పై వచ్చినోడేనని ఆయన అన్నారు.  బుధవారం ఆయన కరీంనగర్‌ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు.  గన్‌పార్కు గురించి రాహుల్‌కు ఏం తెలుసని అక్కడికెళ్లి నివాళులర్పించారని అన్నారు. 

తన సొంత నియోజకవర్గమైన అమేథీలోని మున్సిపాలిటీని గెలిపించుకోలేని రాహుల్‌గాంధీ తెలంగాణలో కాంగ్రెసును గెలిపిస్తానని అనడం విడ్డూరంగా ఉందన్నారు. సంక్రాంతికి గంగిరెద్దోళ్లు వచ్చినట్లు ఎన్నికలు దగ్గరకు రావడంతో ఢిల్లీ నుంచి రాహుల్‌ గాంధీ వచ్చాడని అన్నారు.
 
గంగిరెద్దులవాళ్లతో పోల్చినందుకు వాళ్లు బాధపడవద్దని, వాళ్లు మంచోళ్లని.. కాంగ్రెసోళ్లే లుచ్ఛాగాళ్లని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాహుల్‌గాంధీ ఎక్కడ అడుగు పెడితే అక్కడ కాంగ్రెస్‌ నాశనం అవుతోందని, తెలంగాణలో కూడా అదేగతి పడుతుందని చెప్పారు.
 
కాళేశ్వరం రీడిజైనింగ్‌ పేరుతో దోపిడీ చేశారంటూ రాహుల్‌ మాట్లాడారని, కాంగ్రెస్‌ హయాంలో చేసిన డిజైన్‌ చక్కగా ఉంటే రీడిజైన్‌ ఎందుకు చేస్తామని అన్నారు. ఇందిరమ్మ హయాంలో తెలంగాణ కోసం పోరాడిన 369 మందిని చంపారని.. సోనియా దుర్నీతితో 2004 నుంచి 2014 మధ్య యాదిరెడ్డి లాంటి ఎంతోమంది ఆత్మబలిదానాలు చేసుకున్నారని గుర్తుచేశారు. 
మీడియాపై ఆంక్షలు విధించామంటూ రాహుల్‌ వింత ఆరోపణలు చేశాడని, వాళ్ల నాయనమ్మ ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించి మీడియా గొంతు నొక్కిన విషయం తెలియదా అని అన్నారు.  స్వయంగా ప్రధాని కూడా కేసీఆర్‌ కార్యదక్షతను అభినందించారని చెప్పారు. కాంగ్రెస్‌ నాయకులకు మాత్రం అభివృద్ధి కనిపించడం లేదని ఆరోపించారు. 

click me!