
హైదరాబాద్:కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ప్రధాన కార్యాలయం విశాఖకు తరలి వెళ్లడం ఖాయమని ఏపీ ఇరిగేషన్ శాఖ ఈఎన్సీ నారాయణరెడ్డి చెప్పారు.శుక్రవారం నాడు హైద్రాబాద్ లోని జలసౌధలో కృష్ణా బోర్డు సమావేశం జరిగింది.ఈ సమావేశంలో బోర్డు సభ్య కార్యదర్శి రాయిపురే నేతృత్వంలో జరిగింది.
ఏపీ రాష్ట్రం తరపున ఈఎన్సీ నారాయణరెడ్డి, తెలంగాణ నుండి సీఈ నర్సింహలు పాల్గొన్నారు. ఈ ఏడాది మార్చి నెలాఖరు వరకు రెండు రాష్ట్రాలకు నీటి కేటాయింపులు, విడుదలపై సమావేశంలో చర్చించారు. రెండు రాష్ట్రాలు తమ అవసరాలకు సంబంధించిన నీటి డిమాండ్లకు సంబంధించి సమావేశంలో ప్రస్తావించారు. 108 టీఎంసీలను ఏపీకి, 80 టీఎంసీలు తెలంగాణ కోరింది.
శ్రీశైలంలో 810 అడుగులు, నాగార్జునసాగర్ లో 520 అడుగుల దిగువకు నీరు తీసుకోవద్దని తెలంగాణ డిమాండ్ చేసింది. ఏపీ ఇండెంట్ ను 95 టీఎంసీల లోపు ఇవ్వాలని బోర్డు అధికారులు సూచించారు. రెండు రాష్ట్రాల డిమాండ్లతో పాటు రిజర్వాయర్లలో ఉన్న నీటి మట్టాలతో పాటు ఆయా రాష్ట్రాల కేటాయింపు ఆధారంగా కృష్ణా బోర్డు నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.
గతంలో తీసుకొన్న నిర్ణయం ఆధారంగా కృష్ణా బోర్డును విజయవాడకు తరలించాలని నిర్ణయం తీసుకొన్నారు. అయితే విజయవాడకు కాకుండా విశాఖకు తరలించాలనే నిర్ణయంపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే విశాఖపట్టణానికి కృష్ణా బోర్డు తరలించడం ఖాయమని ఆయన తెలిపారు.