కేసీఆర్ తో లింక్: బిజెపి టీ నేతలకు షాకిచ్చిన అమిత్ షా

By pratap reddyFirst Published Sep 1, 2018, 7:59 AM IST
Highlights

తమ పార్టీ తెలంగాణ నేతలకు బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్ షా షాక్ ఇచ్చారు. కేంద్రంతో సత్సంబంధాలను కొనసాగిస్తున్నవారిని ప్రత్యర్థులుగా చూడలేమని ఆయన తెలంగాణ బిజెపి నేతలకు చెప్పారు.

హైదరాబాద్: తమ పార్టీ తెలంగాణ నేతలకు బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్ షా షాక్ ఇచ్చారు. కేంద్రంతో సత్సంబంధాలను కొనసాగిస్తున్నవారిని ప్రత్యర్థులుగా చూడలేమని ఆయన తెలంగాణ బిజెపి నేతలకు చెప్పారు. 

గురువారం రాత్రి మంత్రాలయంలోని ఆర్ఎస్ఎస్ సభకు వెళ్తూ అమిత్ షా శంషాబాద్ విమానాశ్రయంలో కాసేపు ఆగారు. ఈ సమయంలో ఆయనను బిజెపి తెలంగాణ నేతలు డాక్టర్ కె లక్ష్మణ్, జి. కిషన్ రెడ్డి, బండారు దత్తాత్రేయ కలిశారు. 

కేంద్రంతో మంచి సంబంధాలను కొనసాగిస్తున్నవారిని ప్రత్యర్థులుగా చూడలేమని, కేసిఆర్ కేంద్రంతో సత్సంబంధాలను కొనసాగిస్తున్నారని, కేంద్రంతో రాష్ట్ర సంబంధాలను రాజకీయ కోణంలో చూడలేమని అమిత్ షా వారికి చెప్పారు. 

కేసిఆర్ అసెంబ్లీని రద్దు చేయాలనుకుంటే తాము అపబోమని, ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనేది ఎన్నికల కమిషన్ చూసుకుంటుందని కూడా ఆయన వారితో చెప్పనట్లు సమాచారం. ఎన్నికలను ఎప్పుడు నిర్వహించాలనే విషయాన్ని మనం ఎన్నికల కమిషన్ కు చెప్పలేమని, పార్టీ క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసి ఎన్నికలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని ఆయన బిజెపి నేతలకు చెప్పారు. 

కేంద్రం కేసిఆర్ పట్ల మెతక వైఖరి అవలంబిస్తున్నందున తాము ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయడం వల్ల ఫలితం రాదని బిజెపి తెలంగాణ నేతలు అంటున్నారు. 

కేసిఆర్ కేంద్రంతో సత్సంబంధాలను కొనసాగిస్తున్నారని, అంతకు మించి ఏమీ లేదని కూడా అమిత్ షా ఆర్ఎస్ఎస్ నేతలకు చెప్పినట్లు తెలుస్తోంది. 

click me!