జగన్ సూచిస్తున్నాడు, కేసీఆర్ పాటిస్తున్నాడు: నీటి పంపకాలపై బండి సంజయ్

By team teluguFirst Published Aug 1, 2020, 8:10 AM IST
Highlights

జల వివాదాలు పరిష్కరించడంలో కేంద్రం విఫలమైందని విమర్శిస్తున్న కేసీఆర్‌... ఏపీ ప్రభుత్వం చేపట్టిన కొత్త ప్రాజెక్టులపై ఏపీ సీఎం జగన్‌ను ఎందుకు ప్రశ్నించడం లేదని కేసీఆర్ ను నిలదీశారు బండి సంజయ్. 

ఏపీలో చేపట్టబోయే కొత్త ప్రాజెక్టులకు టెండర్లు పిలవడం ఇప్పుడు తెలంగాణలో ప్రకంపనలు ప్రకంపనలను  పుట్టిస్తుంది. ఈ విషయంలో తెలంగాణ సర్కారుపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలను గుప్పిస్తున్నాయి. 

ఏపీ సీఎం జగన్‌తో ఉన్న ఒప్పందం మేరకే అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశాన్ని 20వ తేదీ తర్వాత నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ పట్టుబడుతున్నారని ప్రతిపక్షాలు ధ్వజమెత్తాయి. జల వివాదాల పరిష్కారంపై కేసీఆర్ కు ఏ మాత్రం చిత్తశుద్ధి లేదని తీవ్ర విమర్శలను గుప్పించాయి. 

బీజేపీ, కాంగ్రెస్‌ నాయకులు మీడియాతో మాట్లాడుతూ ఏపీలో కొత్త ప్రాజెక్టు టెండర్లు 17న ఖరారవుతున్నాయని, ఆ తర్వాత అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం నిర్వహించి ప్రయోజనమేమిటని ప్రతిపక్ష నాయకులు ప్రశ్నించారు. 

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ డీకే అరుణ, ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్‌రెడ్డిలు కేసీఆర్ వైఖరిపై తీవ్రస్థాయిలో దుమ్మెత్తిపోస్తున్నారు. 20వ తేదీ తర్వాత అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీ ఏర్పాటు చేయాలని కేసీఆర్‌ కేంద్రాన్ని కోరడంలో ఆంతర్యం ఏమిటని వారు ప్రశ్నించారు. 

కౌన్సిల్‌ సమావేశంలో అంతకంటే ముందే పాల్గొంటే వచ్చే నష్టం ఏమిటని, ఈ సమావేశం కోసం ఢిల్లీ కూడా వెళ్లాల్సిన అవసరం లేదని,  అరగంట పాటు వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొంటే చాలునని,. ఆ మాత్రం తీరిక కూడా సీఎంకు లేకపోతే ఎలా అని వారు ఆక్షేపించారు. టెండర్లు ఖరారయ్యాక సమావేశం నిర్వహించి ప్రయోజనం శూన్యం అని వారు అన్నారు బండి సంజయ్‌‌. 

జల వివాదాలు పరిష్కరించడంలో కేంద్రం విఫలమైందని విమర్శిస్తున్న కేసీఆర్‌... ఏపీ ప్రభుత్వం చేపట్టిన కొత్త ప్రాజెక్టులపై ఏపీ సీఎం జగన్‌ను ఎందుకు ప్రశ్నించడం లేదని కేసీఆర్ ను నిలదీశారు బండి సంజయ్. 

ఒక వేళ టెండర్లను అడ్డుకుంటే... తన బండారాన్ని జగన్‌ బయటపెడతారని కేసీఆర్‌ భయపడుతున్నట్టు అనిపిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆగస్టు 5న అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం నిర్వహించాలని కేంద్రం నిర్ణయించగా.. జగన్‌ ఆదేశం ప్రకారం 20వ తేదీ తర్వాత నిర్వహించాలని కేసీఆర్‌ కేంద్రాన్ని కోరుతున్నారని సంజయ్ ఆక్షేపించారు. 

తెలంగాణ హక్కులను కాపాడడంలో మొదటి నుంచీ కేసీఆర్‌ విఫలమవుతున్నారని విమర్శించారు. ఏపీ జారీ చేసిన జీవో 203పై కేసీఆర్‌ నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శించారని ఆయన ధ్వజమెత్తారు. 2016 జూన్‌ 21న జరిగిన సమావేశంలో పాల్గొన్న కేసీఆర్‌... కృష్ణా జలాల్లో రాష్ట్ర వాటాగా 555 టీంఎసీలు డిమాండ్‌ చేయాల్సి ఉండగా, 299 టీఎంసీల నీటినే వాడుకుంటామని అంగీకరించడం వల్లే ఈ దుస్థితి వచ్చిందని విమర్శించారు బండి సంజయ్

అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతి లేకుండా కొత్త ప్రాజెక్టులు చేపట్టవద్దని కృష్ణా బోర్డు ఐదు సార్లు లేఖలు రాసినా ఏపీ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆయన అన్నారు. ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారి కూడా కేంద్రానికి లేఖ రాయకపోవడం బాధ్యతారాహిత్యమని ఆయన ఆరోపించారు. 

కృష్ణా జలాల వివాదాల పరిష్కారం కన్నా మించిన అంశం ఏముందని కేసీఆర్ ను నిలదీశారు డీకే అరుణ. పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేయడంలో విఫలమైన కేసీఆర్‌.. తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు కేంద్రంపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఆంధ్రావారి ఓట్ల కోసం పాలమూరు రైతుల ప్రయోజనాలను కేసీఆర్‌ ఫణంగా పెడుతున్నారని ఆమె ఆరోపించారు. 

కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే పెండింగ్‌ ప్రాజెక్టులు వెంటనే పూర్తిచేయాలని డిమాండ్‌ చేశారు. జూరాల నుంచి 5 టీఎంసీలు, నార్లాపూర్‌ నుంచి 4 టీఎంసీలు తీసుకునేలా ప్రాజెక్టులకు రూపకల్పన చేయాలని సూచించారు.

click me!