తెలంగాణలోని ఆంధ్రుల పాలిట శని చంద్రబాబు: కేసీఆర్

By Nagaraju TFirst Published Oct 16, 2018, 7:07 PM IST
Highlights

 తెలంగాణలో స్థిరపడిన ప్రతీ ఆంధ్రుడు తెలంగాణ బిడ్డేనని ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణలో ఉన్న ఆంధ్రులు తాము తెలంగాణ ప్రజలము అని గర్వంగా చెప్పుకోండని సూచించారు.  తెలంగాణ, ఆంధ్రా లనే బేధం టీఆర్ ఎస్ పార్టీకి కానీ,టీఆర్ఎస్ ప్రభుత్వానికి కానీ లేదన్నారు. 

హైదరాబాద్:  తెలంగాణలో స్థిరపడిన ప్రతీ ఆంధ్రుడు తెలంగాణ బిడ్డేనని ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణలో ఉన్న ఆంధ్రులు తాము తెలంగాణ ప్రజలము అని గర్వంగా చెప్పుకోండని సూచించారు.  తెలంగాణ, ఆంధ్రా లనే బేధం టీఆర్ ఎస్ పార్టీకి కానీ,టీఆర్ఎస్ ప్రభుత్వానికి కానీ లేదన్నారు. 

గత నాలుగున్నరేళ్లలో తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా ఆంధ్రా తెలంగాణ అనే బేధం కనిపించిందా అని ప్రశ్నించారు కేసీఆర్. వివక్ష ఉంటే నాలుగున్నరేళ్లలో ఎన్ని గొడవలు జరిగేవని అభిప్రాయపడ్డారు. చిల్లర రాజకీయాల కోసం ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో చంద్రబాబు నాయుడు ఉడుంలా వచ్చి ఆంధ్రాప్రాంతానికి చెందిన వారి పట్ల అభద్రతా కలిగిస్తున్నారన్నారు. తెలంగాణలో చంద్రబాబు అండ్ కోకు డిపాజిట్ రాదని కేసీఆర్ విమర్శించారు. తెలంగాణ సమాజంలో ఎలాంటి వివక్ష లేదని చెప్పారు.

చంద్రబాబు నాయుడు సిగ్గు శరం లేదని తీవ్రంగా దుయ్యబుట్టారు. ఓటుకు నోటు కేసులో ఇరుక్కుపోయినా మళ్లీ తెలంగాణలో ఏ ముఖం పెట్టుకుని అడుగుపెడతావంటూ మండిపడ్డారు. చంద్రబాబు పాలనలో తెలంగాణలో ఎన్నోసార్లు కర్ఫ్యూ పెట్టారని తెలిపారు. ప్రస్తుతం తెలంగాణ ప్రశాంతంగా ఉందన్నారు. చంద్రబాబు పెట్టిన పేకాట క్లబ్బులు పోయాయని, వేటకొడవల్లు పోయాయని, భూకబ్జాలు లేవని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రతలు సరిగ్గా లేవని చెప్పారు.

తెలంగాణలో ఉన్న ఆంధ్రా ప్రజలు తెలంగాణ బిడ్డలేనని కేసీఆర్ స్పష్టం చేశారు. 70 ఏళ్ల క్రితం వచ్చి ఇక్కడే ఉంటున్న ఆంధ్రా సోదరులు మావాళ్లేనన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి తెలంగాణలో స్థిరపడి రాజకీయాలు చేస్తున్నవారిని సైతం ఆదరించామని తెలిపారు. జీహెచ్ఎంసీలో 12 మంది కార్పొరేటర్లకు అవకాశం కల్పించామని, అలాగే 8మంది ఎమ్మెల్యేలుగా అవకాశం ఇచ్చామని గుర్తు చేశారు. 

ఆంధ్రా నుంచి వచ్చి స్థిరపడిన వాళ్లు ఆంధ్రా అనే భావన విడనాడాలని కోరారు. మరోవైపు చంద్రబాబు తో పొత్తుపెట్టుకోవాల్సిన ఖర్మ తమకు పట్టలేదన్నారు. తమకు పొత్తే అవసరం లేదన్నారు. చంద్రబాబు పొత్తు ఒక దుర్మార్గ చర్య అంటూ కేసీఆర్ మండిపడ్డారు. 
 

click me!