బాబును కాను, అక్కడే తేల్చుకుందాం: మోడీకి కేసిఆర్ సవాల్

Published : Nov 27, 2018, 01:54 PM IST
బాబును కాను, అక్కడే తేల్చుకుందాం: మోడీకి కేసిఆర్ సవాల్

సారాంశం

కరెంట్ సరఫరా సరిగా ఉందో లేదో నిజామాబాద్ సభలోనే తేల్చుకుందామని కేసీఆర్ మోడీకి సవాల్ విసిరారు. తాను ఎవరికీ భయపడబోనని, భయపడడానికి తాను చంద్రబాబును కానని ఆయన అన్నారు.

మహబూబ్ నగర్: ప్రధాని నరేంద్ర మోడీపై తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు తీవ్రంగా ధ్వజమెత్తారు. మహబూబ్ నగర్ ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగిస్తూ మోడీకి సవాల్ విసిరారు. తెలంగాణలో కరెంట్ సరఫరా లేదనీ... మంచినీరు లేదని మోడీ అంటున్నారని కేసిఆర్ ప్రస్తావిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

కరెంట్ సరఫరా సరిగా ఉందో లేదో నిజామాబాద్ సభలోనే తేల్చుకుందామని కేసీఆర్ మోడీకి సవాల్ విసిరారు. తాను ఎవరికీ భయపడబోనని, భయపడడానికి తాను చంద్రబాబును కానని ఆయన అన్నారు. "రమ్మంటే హెలికాప్టర్ లో నేను నిజామాబాద్ కే వస్తా, నువ్వు కూడా రా.. ఇద్దరం కలిసి అడుగుదాం.. సభ పెట్టి ప్రజలను అడుగుదాం.. ప్రజలు కరెంట్ కు ఇబ్బందులు పడుతున్నారా అడుగుదాం" అని అన్నారు.

తాను విసిరిన సవాల్ కు జవాబు చెప్పాలని ఆయన మోడీని అడిగారు. ప్రధాని స్థాయిలో ఉండి అంత చెత్తగా ఎలా మాట్లాడుతారని ఆయన అడిగారు.  కళ్లున్నయో, లేవో, ప్రసంగం ఎవడు రాశాడో అని మోడీ ప్రసంగంపై ఆయన వ్యాఖ్యానించారు. ఇంత తెలివి తక్కువ ప్రధాని మోడీ అని తాను అనుకోలేదని ఆయన అన్నారు. తెలంగాణ ఏర్పడగానే నరేంద్ర మోడీ, చంద్రబాబు కలిసి కుట్ర చేశారని, రాష్ట్రపతి పాలన విధించాలని ప్రయత్నించారని, ఆ విషయం తనకు అసదుద్దీన్ ఓవైసీ ఢిల్లీ నుంచి ఫోన్ చేసి చెప్పారని ఆయన అన్నారు. మోడీకి అర్థం కావాలనే తాను ఈ విషయాన్ని హిందీలోనూ ఇంగ్లీషులోనూ చెబుతున్నానని ఆయన అన్నారు. 

ప్రధాని స్థాయి వ్యక్తి అబద్ధాలు ఆడుతున్నారంటే రాజకీయం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవాలని ఆయన అన్నారు. ప్రధాని స్థాయి వ్యక్తి ఇంత అల్పంగా మాట్లాడవచ్చునా, దిక్కుమాలిన రాజకీయం ఉందని ఆయన అన్నారు. ఆయన పార్టీ అధ్యక్షుడు కూడా అలాగే మాట్లాడారని, అప్పుడు తాను సవాల్ విసిరానని, తాను చెప్పింది తప్పయితే తాను రాజీనామా చేస్తానని చెప్పానని, ఆయన చెప్పింది తప్పయితే ఆబిడ్స్ లో ముక్కుకు నేలకు రాయాలని అడిగానని కేసిఆర్ అమిత్ షాను ఉద్దేశించి అన్నారు. 

PREV
click me!

Recommended Stories

Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?
Pensions: తెలంగాణ‌లో రూ. 4 వేలకి పెర‌గ‌నున్న‌ పెన్ష‌న్‌.. ఎప్ప‌టి నుంచి అమ‌లు కానుంది? ప్ర‌భుత్వం ప్లాన్ ఏంటి.?