కేసీఆర్ విస్తరణ వాయిదా: రేగాకు పిలుపు, మజ్లీస్ కు పిఎసి చైర్మన్ పదవి

By telugu teamFirst Published Sep 7, 2019, 12:14 PM IST
Highlights

ఈటల రాజేందర్ వ్యవహారంతో కేసీఆర్ మంత్రివర్గ విస్తరణను వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. ఆ నేపథ్యంలో విప్, చీఫ్ విప్ పదవులను భర్తీ చేయాలని చూస్తున్నారు. రేగా కాంతారావు, పల్లా రాజేశ్వర్ రెడ్డికి పదవులు దక్కే అవకాశం ఉంది. మజ్లీస్ కు పిఎసి చైర్మన్ పదవి రావచ్చు.

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మంత్రివర్గ విస్తరణను వాయిదా వేసుకున్నారు. మంత్రి ఈటల రాజేందర్ వ్యవహారం ముదురుతున్న కారణంగా ఆయన మంత్రివర్గ విస్తరణ ఆలోచనను ప్రస్తుతానికి వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. విస్తరణలో జాప్యం జరిగే అవకాశం ఉండడంతో కేసీఆర్ శాసనసభ కమిటీల ఏర్పాటుపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. 

సోమవారం నుంచి తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఖమ్మం జిల్లా పినపాక శాసనసభ్యుడు రేగా కాంతారావుకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి శనివారం పిలువు వచ్చింది. దాంతో ఆయన హుటాహుటిన హైదరాబదు బయలుదేరారు. ఆయనను ప్రభుత్వ విప్ గా నియమించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ విప్ గా నియమించి ఆయనకు క్యాబినెట్ హోదా కల్పించనున్నట్లు సమాచారం. 

శాసనసభ, శాసన మండలి చీఫ్ విప్, విప్ పదవుల భర్తీకి కేసీఆర్ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత శాసనసభ సమావేశాలు ముగిసే లోగా కమిటీల వివరాలను ప్రకటించే అవకాశం ఉంది. అదే సమయంలో ప్రభుత్వ చీఫ్ విప్, విప్ ల పేర్లను ప్రకటించే అవకాశం ఉంది.  

పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పిఎసి)లో 13 మంది సభ్యులుంటారు. వారిలో తొమ్మిది మంది శాసనసభ నుంచి, నలుగురు శాసన మండలి నుంచి ఎంపికవుతారు. పిఎసి చైర్మన్ పదవిని ప్రధాన ప్రతిపక్షానికి ఇవ్వడం సంప్రదాంయ. 119 మంది శాసనసభ్యులున్న సభలో అధికార టిఆర్ఎస్ కు 103 మంది సభ్యులున్నారు. 

కాంగ్రెసు తరఫున 19 మంది ఎన్నిక కాగా, 12 మంది టీఆర్ఎస్ లో చేరారు. దీంతో కాంగ్రెసు ప్రధాన ప్రతిపక్షం హోదాను కోల్పోయింది. దాంతో ఏడుగురు సభ్యులున్న మజ్లీస్ రెండో అతి పెద్ద పార్టీగా అవతరించింది. అధికారికంగా దానికి ప్రతిపక్ష హోదా దక్కదు. కానీ ఆ పార్టీ ఎమ్మెల్యేలకు పిఎసి చైర్మన్ పదవి దక్కే అవకాశం ఉంది. 

ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, వినయ భాస్కర్, గంప గోవర్ధన్ పేర్లు చీఫ్ విప్ పదవి కోసం వినిపిస్తున్నాయి. వారితో పాటు రవీంద్ర కుమార్, హనుమంతు షిండే, పద్మా దేవేందర్ రెడ్డి, రేఖా నాయక్, బాల్క సుమన్ కూడా రేసులో ఉన్నారు. మండలి విప్ గా ఉన్న డాక్టర్ పల్లా రాజేశ్వర రెడ్డిని చీఫ్ విప్ గా నియమించే అవకాశం ఉంది. ఆయన స్థానంలో మరో ఎమ్మెల్సీని విప్ గా ఎంపిక చేసే అవకాశం ఉంది. 

click me!