ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు అందుకున్న ఎంపి కవిత

Published : Jan 31, 2019, 09:07 PM IST
ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు అందుకున్న ఎంపి కవిత

సారాంశం

నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత  'ఫేమ్ ఇండియా-ఏషియా పోస్ట్ మ్యాగజైన్' బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డును అందుకున్నారు.

న్యూఢిల్లీ: నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత  'ఫేమ్ ఇండియా-ఏషియా పోస్ట్ మ్యాగజైన్' బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డును అందుకున్నారు. గురువారం  సాయంత్రం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ఎంపి కవితకు అవార్డును అందజేశారు.  

లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ నివాసానికి వెళ్లి స్పీకర్ ఆశీస్సులు తీసుకున్నారు. ఫేమ్ ఇండియా-ఏషియా పోస్ట్ మ్యాగజైన్ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రేష్ఠ్ సంసద్ అవార్డుల బహూకరణ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ ఎంపీలు  జితేందర్‌రెడ్డి, బూర నర్సయ్య గౌడ్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీపాటిల్, సంతోష్ కుమార్ పాల్గొన్నారు. 


ఫేమ్ ఇండియా-ఏషియా పోస్ట్ మ్యాగజైన్ ఆదర్శ పార్లమెంటేరియన్ విభాగంలో శ్రేష్ఠ్ సంసద్ పేరుతో సర్వే నిర్వహించి నిజామాబాద్ ఎంపీ కవితను ఉత్తమ పార్లమెంటేరియన్‌గా ఎంపిక చేసిన విషయం తెలిసిందే. అవార్డును అందుకున్న ఎంపీ కవితకు అభిమానులు అభినందనలు తెలిపారు. 

మొత్తం 545 మంది ఎంపీలకు గాను సర్వే ద్వారా 25 మందిని ఉత్తమ ఎంపీలుగా ఎంపిక చేశారు. 

ప్రజాదరణ, కార్యశీలత, సామాజిక సేవాదృక్పథం, లోక్‌సభకు హాజరు, లోక్‌సభ నిర్వహణలో పాత్ర, నియమనిబంధనలు పాటించడం, ప్రశ్నలగడం తదితర అంశాల ఆధారంగా ఎంపీలను ఈ అవార్డుకు ఎంపికచేశారు. 

సర్వే నిర్వహించిన అత్యధిక విభాగాల్లో ఎంపీ కవితకు 90 శాతానికిపైగా పాయింట్లువచ్చాయి. కవిత తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారని, క్రియాశీలకంగా వ్యవహరించారని సర్వే రిపోర్టు పేర్కొన్నది. రాజనీతి, ఉద్యమకారిణి, అనన్య ప్రతిభాశాలిగా, సామాజిక సేవాదృక్పథం, ప్రజాదరణ, కార్యశీలత తదితర అంశాల్లో ఆమెకు మంచి గుర్తింపు ఉన్నదన్నదని తెలిపింది. 

కళా సంస్కృతిని రక్షించడంలో, మంచి మహిళావక్తగా ఆమె పేరుపొందారని వివరించింది. ఉద్యమ సమయంలో అమెరికానుంచి వచ్చి తెలంగాణ ఉద్యమంలో భాగంగా సాంస్కృతిక అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో, ప్రజలను చైతన్యపర్చడంలో క్రియాశీలకంగా వ్యవహరించారని సంస్థ పేర్కొన్నది. బతుకమ్మ పండుగను ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావడంలో ఆమె చురుగ్గా వ్యవహరించారని తెలిపింది.

 తెరమరుగవుతున్న తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కీలకంగా వ్యవహరించారన్నది. మహిళా, సామాజిక సమస్యలపై ఉద్యమాలు, సదస్సులు నిర్వహించారని చెప్పింది.

PREV
click me!

Recommended Stories

Kavitha Pressmeet: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కల్వకుంట్ల కవిత కౌంటర్| Asianet News Telugu
KTR Comments: మేము తిడితే మీ జేజమ్మలకు దిమ్మ తిరుగుద్ది: కేటిఆర్ సెటైర్లు | Asianet News Telugu