టీఆర్ఎస్ ఎమ్మెల్సీకి పరాభవం, కుర్చీలు విసిరేసిన కార్యకర్తలు

By Nagaraju TFirst Published Dec 24, 2018, 3:30 PM IST
Highlights

నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీలోని విబేధాలు రచ్చకెక్కాయి. నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం సాక్షిగా టీఆర్ఎస్ నేతలు బాహాబాహికి దిగడంతో సమావేశం కాస్త రసాభాసగా మారింది. 
 

కల్వకుర్తి : నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీలోని విబేధాలు రచ్చకెక్కాయి. నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం సాక్షిగా టీఆర్ఎస్ నేతలు బాహాబాహికి దిగడంతో సమావేశం కాస్త రసాభాసగా మారింది. 

వివరాల్లోకి వెళ్తే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాలతో ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కల్వకుర్తి నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఆ సమావేశానికి ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి రావడంతో అప్పటి వరకు ప్రశాంతంగా కొనసాగుతున్న సమావేశంలో అలజడి నెలకొంది. 

కసిరెడ్డి రాకతో ఆయన వ్యతిరేక వర్గం టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెచ్చిపోయిన టీఆర్ఎస్ కార్యకర్తలు కుర్చీలు ఎత్తి ఆయనపై విసిరేశారు. అయితే కసిరెడ్డి అనుచరులు చుట్టూ నిల్చుని కుర్చీలు తగలకుండా చూశారు. కసిరెడ్డి గో బ్యాక్‌ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. 

పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగారు. కసిరెడ్డి నారాయణరెడ్డిని సమావేశం నుంచి బయటికి తీసుకువెళ్లిపోయారు. దీంతో పరిస్థితి సద్దుమణిగింది. అనంతరం సమావేశాన్ని ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ నిర్వహించారు. 

రాష్ట్రంలో పేదలకు అండగా, సంక్షేమ పథకాలకు నిలయంగా టీఆర్‌ఎస్‌ పార్టీ ఉందని ప్రజల ప్రగాఢ విశ్వాసంతో నమ్ముతున్నారని అందుకు నిదర్శనమే టీఆర్ఎస్ కు పట్టం కట్టడమన్నారు. కల్వకుర్తి నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఎన్నికల్లో పనిచేసిన నాయకులకు రాబోయే రోజుల్లో సముచిత గౌరవం కల్పిస్తామని హామీ ఇచ్చారు.   

click me!