ఒకరి నిర్లక్ష్యం.. ముగ్గురు చిన్నారులను బలిగొంది

By ramya NFirst Published Feb 25, 2019, 11:40 AM IST
Highlights


మలమూత్ర విసర్జన కోసం బయటకు వెళ్లిన ముగ్గురు చిన్నారులు.. నీటి గుంతలో పడి కన్నుమూశారు.

మలమూత్ర విసర్జన కోసం బయటకు వెళ్లిన ముగ్గురు చిన్నారులు.. నీటి గుంతలో పడి కన్నుమూశారు. ఈ విషాదకర సంఘటన సంగారెడ్డి లో చోటుచేసుకుంది. ఆదివారం సాయత్రం చోటుచేసుకున్న ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

మహారాష్ట్రలోని నాందేడ్ కి చెందిన కొందరు వ్యక్తులు జీవనోపాధి కోసం పది సంవత్సరాల క్రితం సంగారెడ్డి వచ్చి స్థిరపడ్డారు. కుటుంబాలతో సహా.. వారు అక్కడే నివసిస్తున్నారు. కాగా.. వాళ్ల ఇంట్లో టాయ్ లెట్ సదుపాయం లేదు. దీంతో.. వారు మలమూత్ర విసర్జనకు ఆరుబయటకు వెళ్లాల్సిన పరిస్థితి.

కాగా.. వారి బిడ్డలు వంశీకృష్ణ(9), సందేశ్(9), నివృతి(12)లు ఆదివారం మలమూత్ర విసర్జన కోసం ఆరుబయటకు వెళ్లారు. చిన్నారులు బయటకు వెళ్లి చాలా సమయం గడుస్తున్నా.. ఇంటికి తిరిగిరాకపోవడంతో.. తల్లిదండ్రులు కంగారుపడ్డారు. వారి ఆచూకీ కోసం వెతకగా.. అక్కడ ఉన్న ఓ నీటి గుంతలో పడిపోయినట్లు గుర్తించారు.

వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారు గజ ఈతగాళ్ల సహాయంతో చిన్నారుల మృతదేహాలను వెలికి తీశారు. అప్పటి వరకు తమ కళ్ల ముందే ఉన్న చిన్నారులు విగత జీవులుగా మారడాన్ని చూసి ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

కాగా.. ఆ గుంతను ఐదు సంవత్సరాల క్రితం ఒకరు.. ఇసుక కోసం తవ్వకాలు జరిపినట్లు తెలుస్తోంది. అనంతరం ఆ గుంతను మూసివేయకపోవడంతో.. దాంట్లోకి భారీగా నీరు చేరింది. ఆ గుంతలోనే ప్రమాదవశాత్తు చిన్నారులు పడి ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

click me!