
హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికల కోడ్ అమలులో వచ్చిన తర్వాత డబ్బు తరలింపుపై పోలీసులు గట్టి నిఘా పెట్టారు. ఇప్పటికే తెలంగాణలో డబ్బు తరలింపుపై ఉక్కుపాదం మోపుతున్న పోలీస్ శాఖ తాజాగా మరో డబ్బు తరలిస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు. షాహినాయత్ గంజ్ పరిధిలో వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులు డబ్బు తరలిస్తున్న ఓ ద్విచక్ర వాహనం ను స్వాధీనం చేసుకున్నారు.
కారులో సుమారు కోటి 20 లక్షల రూపాయలను తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. అయితే డబ్బుకు సంబంధించి ఎలాంటి వివరాలు చెప్పకపోవడంతో పోలీసులు తమదైన శైలిలో విచారించారు. డబ్బును ఢిల్లీ నుంచి పాహిల్ అనే వ్యక్తి హైదరాబాద్ కు పంపించినట్లు పోలీసుల విచారణలో తేలింది. పాహిల్ అనే వ్యక్తి బేగంబజార్ కు చెందిన భూమారావు అనే వ్యాపారస్థుడుకు పంపించాడు.
భూమారావు ఆ సొమ్మును తన అనుచరులతో కలిసి సికింద్రాబాద్ లోని మరో వ్యాపారికి ఇచ్చేందుకు ఓ ద్విచక్ర వాహనంలో తరలిస్తున్నారు. మార్గ మధ్యలో పోలీసుల చెకింగ్ లో పట్టుబడ్డారు. అయితే ఈ డబ్బుకు సంబంధించి ఎలాంటి పత్రాలు లేకపోవడంతో హవాలా డబ్బుగా పోలీసులు అనుమానిస్తున్నారు.
డబ్బు ఢిల్లీ నుంచి ఎలా వచ్చింది. భూమారావుకు ఉన్న వ్యాపార లావాదేవీలు, పాహిల్ అనే వ్యక్తికి సంబంధించిన పలు అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే డబ్బుకు సంబంధించి ఐటీ శాఖ అధికారులకు సమాచారం అందించారు పోలీసులు.