భద్రాద్రి వద్ద గోదావరి మహోగ్రరూపం... నీట మునిగిన పర్ణశాల, రెడ్ అలర్ట్ జారీ

By Siva KodatiFirst Published Jul 22, 2021, 4:06 PM IST
Highlights

భద్రాద్రి వద్ద గోదావరిలో భారీగా నీటిమట్టం పెరుగుతోంది. ఈ క్రమంలో, పర్ణశాలలో స్వామివారి నార చీరల ప్రాంతం పూర్తిగా నీటమునిగింది. అటు, సీతమ్మ వారి విగ్రహం, స్వామివారి సింహాసనం కూడా మునిగిపోయాయి.

భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాలు తడిసి ముద్దవుతున్నాయి. పలు ప్రాంతాల్లో వాగులు, వంకలు పోటెత్తుతున్నాయి. భద్రాద్రి దుమ్ముగూడెం వద్ద గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. ఎస్సారెస్సీ ఎగువన విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో గోదావరి ఉప్పొంగుతోంది. ఈ ఉదయం నుంచి భద్రాద్రి వద్ద భారీగా నీటిమట్టం పెరుగుతోంది. ఈ క్రమంలో, పర్ణశాలలో స్వామివారి నార చీరల ప్రాంతం పూర్తిగా నీటమునిగింది. అటు, సీతమ్మ వారి విగ్రహం, స్వామివారి సింహాసనం కూడా మునిగిపోయాయి.

ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. రాష్ట్రంలో మరో 48 గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. దాంతో, గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు స్పష్టం హెచ్చరించారు. 

Also Read:తెలంగాణలో వర్షాలు : అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి.. సోమేష్ కుమార్

మరోవైపు రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల నేపధ్యంలో తక్షణ చర్యలను యుద్ధ ప్రాతిపాదికతన చేపట్టాలని, అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ జిల్లా కలెక్టర్లు, ఎస్ పి లను ఆదేశించారు. గురువారం ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్ జిల్లాలకు చెందిన 16 మంది కలెక్టర్లు, ఎసి పి లతో నిర్వహించిన టెలికాన్ఫరేన్సులో వరదల పరిస్ధితిపై సమీక్షించారు.

జిల్లా కేంద్రాలలో కంట్రోల్ రూంలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు పరిస్ధితులను సమీక్షించాలని, ఎటువంటి ప్రాణ, ఆస్ధి నష్టం వాటిల్లకుండా తగు చర్యలు చేపట్టాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. 
 

click me!