టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసు.. ముగ్గురు నిందితులకు బెయిల్.. ఈ షరతులు పాటించాల్సిందే..

By Sumanth KanukulaFirst Published Dec 1, 2022, 11:50 AM IST
Highlights

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న రామచంద్రభారతి, నందకుమార్‌, సింహయాజీలకు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న రామచంద్రభారతి, నందకుమార్‌, సింహయాజీకు బెయిల్ మంజూరు అయింది. ముగ్గురు నిందితులకు తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. రూ. 3 లక్షల చొప్పున పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది. ప్రతి సోమవారం ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ ముందు హాజరుకావాలని హైకోర్టు స్పష్టం చేసింది. ముగ్గురు నిందితులు వారి పాస్‌పోర్టులను పోలీసు స్టేషన్‌లో సరెండర్ చేయాలని ఆదేశించింది. 

ఇదిలా ఉంటే.. ఈ కేసుకు సంబంధించిన కీలక ఆధారాలను సిట్ బుధవారం హైకోర్టుకు సమర్పించింది. ఈ కేసులో ఏడుగురు నిందితులకు వ్యతిరేకంగా ఆడియో, వీడియో క్లిప్‌లు, వాట్సాప్ చాట్‌ల స్క్రీన్‌షాట్లు, ఫోటోలు, సాక్షుల వాంగ్మూలాలు సహా తాము సేకరించిన ఆధారాలను సిట్ బుధవారం హైకోర్టుకు సమర్పించింది. రామచంద్ర భారతి, నంద కుమార్, సింహయాజీ, బీఎల్ సంతోష్, తుషార్ వెల్లపల్లి, జగ్గు స్వామి, న్యాయవాది భూసారపు శ్రీనివాస్‌లను నిందితులుగా పేర్కొంది. 

సాక్ష్యాధారాలను హైకోర్టుకు సమర్పిస్తూ.. రామచంద్రభారతి, బీఎల్ సంతోష్‌లకు చాలా కాలంగా పరిచయం ఉందని సిట్ తెలిపింది. 2021 ఆగస్టు 2021 నుంచి వారిద్దరి మధ్య వాట్సాప్ చాట్‌లను, 2022 ఏప్రిల్ 11న హరిద్వార్‌లో వారిద్దరు కలిసినప్పటీ ఫొటోను కూడా సమర్పించింది. అక్టోబర్ 26న ఎమ్మెల్యేలకు సంబంధించిన అప్‌డేట్‌కు సంబంధించి బీఎల్ సంతోష్‌కు రామచంద్ర భారతి పంపిన సందేశం కూడా కోర్టుకు సంబంధించిన ఆధారాల్లో ఉందని తెలిపింది. సంతోష్ నివాసంలో అక్టోబర్ 15న ఉదయం 10 గంటలకు జరిగిన సమావేశానికి రామచంద్రభారతి, నందకుమార్, సంతోష్, తుషార్, ముజగళ్ల విజయ్ కుమార్‌లు హాజరయ్యారని.. అక్కడే ఆరోపించిన కుట్రకు ప్రణాళిక రచించినట్టుగా సిట్ తెలిపింది. 

ఇదిలా ఉంటే.. ఈ కేసులో కోర్టుకు, న్యాయవాదులకు సమర్పించిన ఆధారాలను మీడియా ఛానెల్‌లు ప్రసారం చేయడంపై సిట్ బాధ్యత వహించదని హైదరాబాద్ పోలీస్ కమిషనర్, సిట్‌కు నేతృత్వం వహిస్తున్న సీవీ ఆనంద్ ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. 

click me!