తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రచార రథాలు సిద్ధమవుతున్నాయి. నేతలు తమకు కావాల్సినట్లుగా వాటిని డిజైన్ చేసుకుంటున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నేతలు ఇందుకోసం లక్షల్లో వెచ్చిస్తున్నారు.
తెలంగాణలో మరికొద్దినెలల్లో అసెంబ్లీ ఎన్నికల హడావుడి మొదలుకానుంది. ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 115 మందితో తొలి జాబితా ప్రకటించారు. త్వరలోనే కాంగ్రెస్, బీజేపీలు కూడా తమ అభ్యర్ధులను ప్రకటించనున్నాయి. అయితే ఎన్నికల్లో పార్టీలు తమ విధానాలను తెలిపేందుకు, ప్రజలను ఓట్లను అభ్యర్ధించేందుకు విస్తృతంగా ప్రచారం చేస్తాయన్న సంగతి తెలిసిందే. ఇందుకోసం హైటెక్ ప్రచార వాహనాలు సిద్ధమవుతున్నాయి.
పార్టీల అగ్రనేతలతో పాటు నియోజకవర్గ స్థాయి నేతలు , అభ్యర్ధులు కూడా తమకు అనుకూలమైనట్లుగా ప్రచార రథాలు సిద్ధం చేసుకుంటున్నారు. అక్టోబర్ 10వ తేదీలోగా ఎన్నికల సంఘం తెలంగాణ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నందున వీలైనంత త్వరగా ప్రచార వాహనాలు సిద్ధం చేయాలని తయారీ సంస్థలకు నేతల నుంచి ఒత్తిడి పెరుగుతోంది.
ప్రచార వాహనాల్లో అధునాతన మైక్ సెట్లు, సౌండ్ సిస్టమ్, ఎల్ఈడీ తెరలు వంటి ఫీచర్లను అమరుస్తున్నారు. అయితే ప్రచార వాహనాలను బుక్ చేసుకోవడంలో బీజేపీ నేతలు అందరికంటే ముందున్నరట. డిమాండ్ ఎక్కువగా వుండటంతో వాహనాల సరఫరాదారులు పొరుగు రాష్ట్రాల నుంచి వాహనాలను అద్దెకు తీసుకొస్తున్నారట. తెలంగాణలో గడిచిన 15 రోజుల్లో బీజేపీ నుంచి 60 బుకింగ్‌లు, బీఆర్ఎస్ నుంచి పాతిక, కాంగ్రెస్ నుంచి 20 బుకింగ్‌లు వచ్చాయని ఓ సరఫరాదారుడు మీడియాకు తెలిపాడు. నేతల్లో కొందరు నెలవారీ ప్రాతిపదికన వాహనాలను అద్దెకు తీసుకుంటున్నారని, కొందరు ఒకేసారి బుక్ చేసుకుంటున్నారని.. అవసరమైన మార్పుల కోసం రూ. లక్షలు ఖర్చు చేసేందుకైనా వెనుకాడటం లేదని నిర్వాహకులు చెప్పారు.