కరోనా వైరస్: కరీంనగర్ లో హై అలర్ట్, 144 సెక్షన్ అమలు

By telugu teamFirst Published Mar 19, 2020, 1:52 PM IST
Highlights

తెలంగాణకు వచ్చిన విదేశీయులు ఇంటి నుంచి బయటకు రావద్దని గాంధీ ఆస్పత్రి సూపరింటిండెంట్ శ్రవణ్ కుమార్ సూచించారు. తెలంగాణలో కొత్త మరిన్ని కేసులు బయటపడిన నేపథ్యంలో ఆయన ఆ సూచన చేశారు.

హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 13కి చేరడం భయాందోళనకు గురి చేస్తోంది. కరీంనగర్ లో బుధవారం(మార్చి 18,2020) ఒక్క రోజే ఏడు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇండోనేషియా నుంచి వచ్చిన 11 మంది ఇస్లామిక్ మత ప్రచారకుల బృందంలో ఏడుగురికి కరోనా సోకింది. ఒకేసారి ఏడు మందికి కరోనా సోకడం అందరిని ఆందోళనకు గురి చేస్తోంది. అప్రమత్తమైన అధికారులు కరీంనగర్ జిల్లా కేంద్రంలో హైఅలర్ట్ ప్రకటించారు. ముందు జాగ్రత్తగా కలెక్టరేట్ కు 3 కిలోమీటర్ల పరిధిలో ఆంక్షలు విధించారు. హోటళ్లు, దుకాణాలు మూసివేశారు.

4 మసీదులు, రెండు హోటళ్లలో కరోనా బాధితులు బస

దీనిపై మంత్రి గంగుల కమలాకర్ స్పందించారు. ఇండోనేషియా నుంచి వచ్చిన మత ప్రచారకులు నగరంలో ఎక్కడెక్కడ తిరిగారు, ఎవరెవరిని కలిశారు అనే వివరాలు సేకరించే పనిలో ఉన్నామని చెప్పారు. 

మత ప్రచారకులు నగరంలోని 4 మసీదులకు వెళ్లినట్లు, రెండు హోటళ్లో బస చేసినట్టు ప్రాథమికంగా గుర్తించినట్టు మంత్రి వెల్లడించారు. ఇంకా వారు ఎక్కడెక్కడ నమాజు చేశారు, ఎవరిని కలిశారు అనే వివరాలు తెలుసుకుంటున్నట్టు చెప్పారు. గురువారం(మార్చి 19,2020) సాయంత్రానికి దీనిపై ఒక క్లారిటీ వస్తుందన్నారు.

ఇళ్ల నుంచి బయటకు రావొద్దు

కరోనా నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. ప్రజలు ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దన్నారు. గుంపులు గుంపులుగా తిరగొద్దన్నారు. కొత్త వారిని కలవొద్దన్నారు. ఒక వేళ బయటకు రావాల్సి వస్తే ఒకరు లేదా ఇద్దరు మాత్రమే రావాలన్నారు. వ్యక్తి వ్యక్తి మధ్య ఒకటిన్నర మీటరు దూరం కచ్చితంగా పాటించాలన్నారు. 

కరోనా కేసులు నమోదు కావడంతో భయాందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు. ప్రజలకు తమకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

రంగంలోకి 100 వైద్య బృందాలు:

కరోనా పంజా నేపథ్యంలో 100 ప్రత్యేక వైద్య బృందాలను రంగంలోకి దింపినట్టు మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. గురువారం కరీంనగర్ నగరంలోని ప్రతి ఇంటికి వైద్య బృందం వెళ్తుందని, ప్రతి ఒక్కరికి నిర్బంధ వైద్య పరీక్షలు చేస్తారని మంత్రి స్పష్టం చేశారు. అనుమానం ఉన్నవారిని వెంటనే హైదరాబాద్ గాంధీకి తరలిస్తామన్నారు. అక్కడి చికిత్స అందిస్తామన్నారు. ప్రజలు గుంపులుగా తిరగొద్దని మంత్రి రిక్వెట్ చేశారు. ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.

విదేశాల నుంచి వచ్చిన వాళ్లు ఇళ్ల నుంచి బయటికి రావద్దని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్ శ్రవణ్ కుమార్ సూచించారు. కరోనా లక్షణాలుంటే వైద్యుడిని సంప్రదించాలని ఆయన మీడియాతో చెప్పారు. ప్రతి ఒక్కరు కరోనా వైరస్ రాకుండా కాపాడు కోవాలని సూచించారు. 

అనుమానం వస్తే ప్రతి ఒక్కరు స్వచ్ఛంధంగా పరీక్షలు చేయించు కోవాలన్నారు. ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతగా వ్యవహరించాలని, జ్వరం వస్తే నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలన్నారు. కరోనా స్టేజ్‌-2 రాకుండా కాపాడు కోవాలన్నారు. ఏదైనా బస్తీ నుంచి కరోనా కేసు వస్తే చాలా ప్రమాదకరమని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్ శ్రవణ్ కుమార్ అన్నారు.

click me!