మనసు మార్చుకున్న మాజీమంత్రి, నామినేషన్ విత్ డ్రా

By Nagaraju TFirst Published Nov 20, 2018, 3:53 PM IST
Highlights

నిత్యం వివాదాల్లో ఉండే మాజీమంత్రి శంకర్ రావు 2014 ఓటమి తర్వాత దాదాపుగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అప్పుడప్పుడు ఓ మెరుపు మెరిపించినా గతంలో చేసిన విమర్శలు కానీ ఏమీ చేయకుండానే మౌనం దాల్చారు. అయితే ముందస్తు ఎన్నికల్లో పోటీ చేసేందుకు మాత్రం రెడీ అయ్యారు.  
 

రంగారెడ్డి: నిత్యం వివాదాల్లో ఉండే మాజీమంత్రి శంకర్ రావు 2014 ఓటమి తర్వాత దాదాపుగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అప్పుడప్పుడు ఓ మెరుపు మెరిపించినా గతంలో చేసిన విమర్శలు కానీ ఏమీ చేయకుండానే మౌనం దాల్చారు. అయితే ముందస్తు ఎన్నికల్లో పోటీ చేసేందుకు మాత్రం రెడీ అయ్యారు.  

గతంలో కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి గెలుపొంది మంత్రి అయిన శంకర్ రావు ప్రస్తుతం షాద్ నగర్ నియోజకవర్గంపై కన్నేశారు. కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ఇవ్వకపోవడంతో మాజీ మంత్రి శంకర్‌రావు అలిగారు. కాంగ్రెస్ పార్టీ తనకు టిక్కెట్ ఇవ్వకపోవడంతో కాంగ్రెస్ పార్టీపై ఓ స్థాయిలో విరుచుకుపడ్డారు. 

పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి టిక్కెట్లు అమ్ముకున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. నలభై ఏళ్లు కాంగ్రెస్ పార్టీకి సేవ చేసిన తనకు టిక్కెట్ ఇవ్వలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో తనకు న్యాయం జరగలేదని మండిపడ్డారు.

ఆ తర్వాత సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థిగా షాద్ నగర్ నియోజకవర్గంలో నామినేషన్ దాఖలు చేశారు. మాజీమంత్రి శంకర్ రావు రంగంలోకి దిగడంతో కాంగ్రెస్ పార్టీ బుజ్జగింపులకు దిగింది.  ఈ నేపథ్యంలో పోటీపై మనసు మార్చుకున్నట్లు శంకర్‌రావు తెలిపారు. 

కాంగ్రెస్‌ నేతల విజ్ఞప్తి మేరకు తాను పార్టీలోనే కొనసాగుతున్నట్లు ఆయన మంగళవారం ప్రకటించారు. మహాకూటమి బలపరిచిన టీడీపీ, కాంగ్రెస్‌ అభ్యర్థుల గెలుపునకు కృషి చేస్తానని శంకర్ రావు వెల్లడించారు.  

ఇకపోతే పార్టీ మారి 24 గంటలు కూడా కాకముందు మాజీమంత్రి ఇలా ప్లేటు ఫిరాయించడంతో ప్రజలు అవాక్కయ్యారు. మాజీమంత్రి శంకర్ రావు నామినేషన్ ఉపసంహరించుకోవడంతో రెబల్స్ అభ్యర్థులపైనా కాంగ్రెస్ దృష్టి సారించింది. నామినేషన్‌ దాఖలు చేసిన నేతలు విత్ డ్రా చేసుకునేలా ప్రయత్నాలు ప్రారంభించింది. అందులో భాగంగా అధిష్టానం దూతలను సైతం రంగంలోకి దించినట్లు ప్రచారం. 

 

click me!