ఇన్సూరెన్స్ డబ్బుల కోసం.. దుకాణం తగలపెట్టాడు

By ramya neerukondaFirst Published Jan 12, 2019, 12:52 PM IST
Highlights

వ్యపారంలో నష్టం వచ్చిందని ఓ వ్యక్తి వేసిన ప్లాన్ తిరగపడింది. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం తన సొంత దుకాణాన్ని అతనే తగలపెట్టుకున్నాడు. 


వ్యపారంలో నష్టం వచ్చిందని ఓ వ్యక్తి వేసిన ప్లాన్ తిరగపడింది. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం తన సొంత దుకాణాన్ని అతనే తగలపెట్టుకున్నాడు. తీరా ఇన్సూరెన్స్ డబ్బులు రాకపోగా.. షాప్ తగలపెట్టింది అతనేనని దర్యాప్తులో తేలింది. 

పూర్తి వివరాల్లోకి వెళితే... ఖమ్మం పట్టణానికి చెందిన దేవాండ శ్రీనివాస్ 2017 మార్చి నెలలో ఓ బిల్డింగ్ ని అద్దెకు తీసుకొని బట్టల దుకాణం పెట్టాడు. అయితే.. అతను ఊహించినంతగా వ్యాపారం సాగలేదు. దీంతో.. ఏడాది తిరగకముందే నష్టాలబాట పట్టాడు. ఆ నష్టం పూడ్చుకునేందుకు ఓ ప్లాన్ వేశాడు.

2018 అక్టోబర్ 26న తన దుకాణంలోని బట్టలు, ఫర్నీచర్, విలువైన కొన్ని వస్తువులకు రూ.99లక్షల ఇన్సూరెన్స్ చేయించాడు. ఆ తర్వాతి రోజు.. దుకాణంలోని బట్టలు, ఇతర వస్తువులను వేరే ప్రాంతానికి తరలించాడు. 29వ తేదీన కింద ఫ్లోర్ లో ఉన్న బట్టలపై పెట్రోల్ పోసి.. కరెంట్ వైర్ల ద్వారా నిప్పు పుట్టించి..వాటికి అంటించాడు. దీంతో మంటలు ఒక్కసారిగా వ్యాపించాయి. ఈ మంటల కారణంగా దుకాణంలోని విద్యుత్ పరికరాలు కాలిపోయి.. అక్కడే ఉన్న సిలిండర్ పేలింది.

దీంతో దుకాణం సగానికి పైగా కాలిబూడిదయ్యింది. శ్రీనివాస్ కి కూడా స్వల్పగాయాలు అయ్యాయి. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టగా.. దుకాణ యజమానే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలిసింది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. 

click me!