సూర్యాపేట : అయ్యప్ప పూజకు వెళ్లివస్తుండగా రోడ్డు ప్రమాదం, ఐదుగురు మృతి

By Arun Kumar PFirst Published Nov 13, 2022, 7:42 AM IST
Highlights

భక్తిశ్రద్దలతో అయ్యప్ప పడిపూజలో పాల్గొని తిరిగి వెళుతున్న భక్తులు రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన దారుణం సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది. 38 మందితో వెళుతున్న ట్రాక్టర్ ను వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. 

సూర్యాపేట : డ్రైవర్ చేసిన చిన్న తప్పు ఐదుగురి ప్రాణాలను బలితీసుకోవడమే పదుల మందిని హాస్పిటల్ పాలయ్యేలా చేసింది.  శబరిగిరీషుడు అయ్యప్పస్వామి మహాపడిపూజకు వెళ్లిన భక్తులు తిరిగివస్తున్న ట్రాక్టర్ ప్రమాదానికి గురయిన ఘటన సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది. అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కొందరి ప్రాణాలు పోయినా చాలామంది సురక్షితంగా బయటపడ్డారు. 

వివరాల్లోకి వెళితే... ఉమ్మడి నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ లోని అయ్యప్పస్వామి ఆలయంలో శనివారం మహాపడిపూజ నిర్వహించారు. ఈ పూజకు మునగాలకు చెందిన అయ్యప్ప మాలధారులు, మరికొందరు భక్తులు ట్రాక్టర్ పై వెళ్లారు. ఇలా మొత్తం 38 మంది అయ్యప్ప మహాపడిపూజలో పాల్గొని స్వామివారిని భక్తిశ్రద్దలతో కొలిచారు. ఈ పడిపూజ పూర్తయ్యాక అక్కడే భోజనం చేసి అర్ధరాత్రి స్వస్థలానికి తిరుగుపయనం అయ్యారు. అయితే మరికొద్దిసేపట్లో గమ్యానికి చేరుతారనగా ఘోర ప్రమాదం జరిగింది. దీంతో అప్పటివరకు హాయిగా సాగిన ప్రయాణం ఒక్కసారిగా హాహాకారాలతో నిండిపోయింది.  

మునగాల దగ్గరకు వెళ్ళాక సమయం ఆదా అవుతుందని ట్రాక్టర్ డ్రైవర్ జాతీయ రహదారిపై రాంగ్ రూట్ లో పోనిచ్చాడు. ఇలాగ్రామ శివారులోని పెట్రోల్ బంక్ వద్దకు వెళ్లగానే విజయవాడ నుండి హైదరాబాద్ వెళుతున్న లారీ వేగంగా వచ్చి ఈ ట్రాక్టర్ ను ఢీకొట్టింది. దీంతో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందగా మరో పదిమంది తీవ్రంగా గాయపడ్డారు. మిగతావారు చిన్నచిన్న గాయాలతో సురక్షితంగా బయటపడ్డారు.  

Read More  తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదాలు, రెండు వేర్వేరు ఘటనల్లో ముగ్గురు మృతి, 9మందికి గాయాలు..

ప్రమాదంపై సమాచారం అందుకున్న మునగాలవాసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను దగ్గర్లోని కోదాడ హాస్పిటల్ కు తరలించారు. గాయపడ్డవారిలో కొందరి పరిస్థితి విషమంగా వుండటంతో ఖమ్మం, సూర్యాపేట జిల్లా హాస్పిటల్స్ కు తరలించారు. ప్రమాదానికి గురయిన ట్రాక్టర్ పూర్తిగా తుక్కుతుక్కవగా లారీ స్వల్పంగా ధ్వంసమయ్యింది. 

మునగాల వద్ద రోడ్డు ప్రమాదం జరిగినట్లు సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. అయితే అప్పటికే క్షతగాత్రులను హాస్పిటల్ కు తరలించడంతో పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను హాస్పిటల్ కు తరలించే ఏర్పాట్లు చేసారు. మృతుల్లో ఓ వృద్దుడు కోటయ్య(60), మరో చిన్నారి ఉదయ్ లోకేష్ (11) తో పాటు ముగ్గురు మహిళలు ప్రమీల (32), తన్నీరు ప్రమీల (30), జ్యోతి (36) వున్నారు ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణంగా ప్రాథమిక నిర్దారణకు వచ్చారు. 

click me!