
మంచిర్యాల : మంచిర్యాల జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇంట్లో చెలరేగిన మంటలు ఐదుగురిని బలితీసుకున్నాయి. కుటుంబ యజమానితో సహా ఐదుగురు సభ్యులు ఈ మంటల్లో సజీవంగా దహనమయ్యారు. ఈ విషాద ఘటన మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం వెంకటాపూర్ లో జరిగింది. ఈ ఘోర అగ్ని ప్రమాదంలో చనిపోయిన వారిలో శివయ్య (50), ఆయన భార్య పద్మ (45), మౌనిక (23).. ఈమె పద్మ అక్క కూతురు.. వీరితో పాటు మౌనిక ఇద్దరు కుమార్తెలు మృతి చెందారు. మంటలు చెలరేగడం గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేశారు. సహాయక చర్యలు పోలీసులు చేపట్టారు. అగ్ని ప్రమాదానికి కారణాలు ఏంటో డిసిపి అఖిల్ మహాజన్ ఆరా తీశారు.
ఇదిలా ఉండగా, అక్టోబర్ 25న హైదరాబాద్ లో ఇలాంటి ఘోర అగ్ని ప్రమాదమే సంభవించింది. ముషీరాబాద్ లోని ఎస్ఎం టింబర్ డిపోలో అగ్ని ప్రమాదం జరిగింది. గోడౌన్ లో పెద్ద ఎత్తున కర్ర సామాగ్రి ఉండటంతో మంటలు ఎగిసిపడ్డాయి. స్థానికులు అందించిన సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైరింజన్లతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పోలీసులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై అగ్నిమాపక శాఖ, పోలీసు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
న్యూ ఇయర్ వేడుకల కోసం పార్టీ అనుమతులు తప్పనిసరి.. దరఖాస్తు చివరితేదీ ఎప్పుడంటే..?
ఇదిలా ఉండగా, దీపావళిని రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఎంతో సంతోషంగా జరుపుకున్నారు. అయితే అక్కడక్కడా పండుగలో అపశృతులు కనిపించాయి. అగ్నిప్రమాదాలతో పాటు, పలువురు క్షతగాత్రులైన ఘటనలు అక్కడక్కడా కనిపించాయి. కృష్ణాజిల్లాలో దీపావళి పండుగరోజు విషాదం చోటు చేసుకుంది. మచిలీపట్నం శివారు నవీన్ మిట్టల్ కాలనీ సీతా నగర్ లో టపాసులు పెళ్లి 11 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. టపాసులు ఆరబెడుతుండగా అవి ఒక్కసారిగా పేలాయి. దీంతో పక్కనే ఉన్న ద్విచక్రవాహనంపై నిప్పులు పడడంతో ట్యాంక్ అంటుకుని వాహనం పేలిపోయింది.
దీంతో బాలుడు మంటల్లో చిక్కుకున్నాడు. ముందు టపాసులు పేలడం, ఆ తరువాత బైక్ పేలుడు శబ్దంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి బయటికి వచ్చిన తల్లిదండ్రులు, స్థానికులు.. బాలుడిని హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం గుంటూరు తరలించారు. గుంటూరు జిజిహెచ్ లో చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు. దీంతో సీతా నగర్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
తెలంగాణలోనూ ఇలాంటి ఘటనలు అక్కడక్కడా చోటు చేసుకున్నాయి. హైదరాబాదులో దీపావళి వేడుకల్లో టపాసులు కాలుస్తూ పలువురు గాయపడ్డారు. వీరిని చికిత్స కోసం సరోజినీ దేవి కంటి ఆసుపత్రి కి తరలించారు. ఇప్పటివరకు 24 మంది బాధితులు గాయాలతో ఆస్పత్రికి వచ్చినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. వీరిలో అత్యధిక మంది చిన్నారులే ఉన్నారు. గాయపడిన వారిలో 12 మంది ఆస్పత్రిలో అడ్మిట్ కావడంతో.. వారికి వైద్యులు చికిత్స చేస్తున్నారు. బాధితుల్లో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. వారిలో ముగ్గురిని ఇతర ఆసుపత్రులకు సిఫార్సు చేసినట్లు చెప్పారు.