మూడో పెళ్లికి అడ్డం: కన్నబిడ్డను మెడలు విరిచి చంపిన తండ్రి

By Siva KodatiFirst Published Aug 11, 2019, 1:34 PM IST
Highlights

మూడో పెళ్లి చేసుకోవడానికి అడ్డుగా ఉన్నాడే కోపంతో కన్న బిడ్డని తండ్రి అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలం జాజిరెడ్డిగూడేనికి చెందిన చింతల కనకయ్యకు ఇప్పటికే రెండుసార్లు వివాహం జరిగింది. 

మూడో పెళ్లి చేసుకోవడానికి అడ్డుగా ఉన్నాడే కోపంతో కన్న బిడ్డని తండ్రి అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. వివరాల్లోకి వెళితే.. సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలం జాజిరెడ్డిగూడేనికి చెందిన చింతల కనకయ్యకు ఇప్పటికే రెండుసార్లు వివాహం జరిగింది.

యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం చౌళ్ల రామారం గ్రామానికి చెందిన ఓ యువతితో కనకయ్యకు మొదటి వివాహం జరగ్గా.. మనస్పర్థల కారణంగా ఆరు నెలల్లోనే ఆమెతో విడాకులు తీసుకున్నాడు.

ఈ క్రమంలో ఉపాధి కోసం హైదరాబాద్‌కు వెళ్లిన కనకయ్య.. నగరంలోని దమ్మాయిగూడలో నివసించేవాడు. రోజువారీ కూలిపనులకు వెళుతుండగా.. జనగాంకు చెందిన స్వప్నతో పరిచయం ఏర్పడింది.

ఈ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో పెద్దలను ఎదిరించి కులాంతర వివాహం చేసుకున్నాడు. వీరికి కుమార్తె, కుమారుడు అక్షయ్ ఉన్నారు. వీరు ఈసీఐఎల్‌లోని అంబేద్కర్ నగర్‌లో ఉంటూ రోజువారీ కూలీలుగా ఉంటూ జీవనం సాగిస్తున్నారు.

అయితే కొద్దిరోజుల నుంచి దంపతుల మధ్య గొడవలు జరుగుతుండటంతో స్వప్న భర్తకు దూరంగా ఉంటోంది. ఇటీవల కనకయ్య కుమార్తెను తల్లి దగ్గరే ఉంచి కొడుకు అక్షయ్‌ని తీసుకుని తిరుమలరాయిని గూడెంలో ఉంటున్న పెద నాన్న చింతల రాములు ఇంటికి వచ్చి అక్కడే ఉంటున్నాడు.

ఈ క్రమంలో గురువారం రాత్రి కనకయ్య కొడుకుని తన దగ్గరే పడుకోబెట్టుకున్నాడు. రాత్రి 11.30 గంటల సమయంలో అక్షయ్‌ గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం ఎవరికి అనుమానం రాకుండా ఇంటిముందు మంచంలో బిడ్డ మృతదేహాన్ని ఉంచి అక్కడి నుంచి పారిపోయాడు.

మర్నాడు ఉదయం నిద్రలేచిన రాములు కుటుంసభ్యులు.. మంచం మీద అక్షయ్ ఉలుకు పలుకూ లేకుండా పడివుండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు అనుమానాస్పద మృతి కేసును నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

స్థానికుల సమాచారంతో కనకయ్యను పట్టుకుని విచారించగా అసలు నిజం చెప్పాడు. తాను మూడో పెళ్లి చేసుకునేందుకు కుమారుడు అక్షయ్ అడ్డుగా ఉన్నాడనే కారణంతోనే అతనిని చంపినట్లు అంగీకరించాడు. కనకయ్యపై ఐపీసీ-302 సెక్షన్ కింద హత్యానేరం నమోదు చేసిన పోలీసులు.. న్యాయస్థానంలో హాజరుపరిచారు. 

click me!