ఈటల రాజేందర్ కే నా మద్దతు: మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు

By Arun Kumar PFirst Published Jul 25, 2021, 1:27 PM IST
Highlights

ఎమ్మెల్యే పదవికి, టీఆర్ఎస్ కు రాజీనామా చేసిహుజురాబాద్ ఉపఎన్నికకు సిద్దమవుతున్న ఈటల రాజేందర్ కు మరింత మద్దతు లభించింది. ఆయనకు మద్దతిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు ప్రకటించారు. 

కరీంనగర్: మాజీ మంత్రి, బిజెపి నాయకులు ఈటల రాజేందర్ కే తన మద్దతు వుంటుందని మాజీ ఎమ్మెల్యే, ఆర్టిసి మాజీ ఛైర్మన్ గోనే ప్రకాష్ రావు ప్రకటించారు. కరోనా కాలంలో అలుపెరుగకుండా శ్రమించిన వ్యక్తి ఈటెల అని ప్రశంసించారు. హుజురాబాద్ ఉప ఎన్నికలో ప్రజలు కూడా ఈటలకే మద్దతిస్తారని అన్నారు. 

''హుజురాబాద్ నియోజకవర్గం రెడ్డి సామాజిక వర్గానికి చెందినది. అలాంటి చోట ఒక బీసీ నాయకుడు ఆరు సార్లు పోటీ చేసి గెలిచాడంటే ఆలోచించాలి. హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు నైతిక విలువలు కలిగినవారు. కాబట్టి అనూహ్య రీతిలో ఇంటెలిజెన్స్ కి కూడా అంతు పట్టని తీర్పునిస్తారు'' అన్నారు.

''టీఆర్ఎస్  ప్రభుత్వం దళిత బంధు పైలెట్ ప్రాజెక్ట్ ను హుజురాబాద్ లో కాకుండా ఎస్సి రిజర్వుడ్ నియోజకవర్గంలో పెట్టాల్సింది. ఉపఎన్నిక దృష్ట్యా ఈటెలను ఓడించడానికే సీఎం కేసీఆర్ హుజురాబాద్ లో దళిత బంధు ఇస్తున్నాడు. ప్రలోబాలకు లొంగకుండా హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు ఈటెలను గెలిపించాలి'' అని గోనె ప్రకాష్ కోరారు. 

read more  వైఎస్ జగన్ బండారం బయటపెడ్తా, బెయిల్ రద్దు ఖాయం: గోనె ప్రకాశ్ రావు

ఇటీవల అధికార టీఆర్ఎస్, సీఎం కేసీఆర్, ఆయన కుటుంబంపై పై ప్రకాష్ రావు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ పార్టీ ఎంపీ సంతోష్ కుమార్ కన్ను ముఖ్యమంత్రి పదవి పడిందని ఆయన ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత సీఎం కేసీఆర్ ను కలవాలంటే సంతోష్ అనుమతి పొందాల్సిందేనని... లేదంటే కేసీఆర్ అపాయింట్ మెంట్ లభించదన్నారు. చివరకు ఇంటలిజెన్స్ సమాచారం కూడా సీఎంకు సంతోష్ కుమార్ ద్వారానే  వెళ్తుందని ప్రకాష్ రావు తెలిపారు. 
 
సంతోష్ కుమార్ తో సహా ఆయన  కుటుంబ సభ్యులు వేల కోట్లు ఆర్జించారని ప్రకాష్ రావు ఆరోపించారు. అంతేకాదు తన అధికారాలను ఉపయోగించి సంతోష్ అమాయకులపై అక్రమ కేసులు పెట్టిస్తున్నారని అన్నారు. తక్షణమే దళితులపై పెట్టించిన కేసులు ఎత్తివేయించడమే కాదు తక్షణమే అక్రమ దందాలు ఆపాలని  ప్రకాష్ రావు డిమాండ్ చేశారు. భవిష్యత్తులో సంతోష్ కు జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు.

 
 

click me!