క్యాబినెట్ బెర్తుల లీకులు: అలక బూనిన ఈటెల రాజేందర్

By Nagaraju TFirst Published Dec 25, 2018, 2:48 PM IST
Highlights

తెలంగాణ రాష్ట్రంలో మంత్రివర్గం ఏర్పాటు దేవుడెరుగు. మంత్రి వర్గంలో తమకు బెర్త్ కన్ఫమ్ అవుతుందా లేదా అని కొందరు సీనియర్ నేతలు ఆందోళన చెందుతున్నారు. మంత్రి వర్గం కూర్పు పూర్తవ్వకుండానే వస్తున్న లీకులతో ఉలిక్కిపడుతున్నారు. 
 


హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మంత్రివర్గం ఏర్పాటు దేవుడెరుగు. మంత్రి వర్గంలో తమకు బెర్త్ కన్ఫమ్ అవుతుందా లేదా అని కొందరు సీనియర్ నేతలు ఆందోళన చెందుతున్నారు. మంత్రి వర్గం కూర్పు పూర్తవ్వకుండానే వస్తున్న లీకులతో ఉలిక్కిపడుతున్నారు. 

పార్టీలో సీనియారిటీ, సిన్సియారిటీ ప్రకారం పదవులు ఇస్తారని భావిస్తున్న తరుణంలో కేబినేట్ లో బెర్త్ లపై వస్తున్న లీకులు సీనియర్ నేతల కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు టీఆర్ఎస్ సీనియర్ నేత మాజీమంత్రి ఈటల రాజేందర్. 

ఈటల రాజేందర్ కు స్పీకర్ పదవి అంటూ ఇప్పటికే లీకులు వస్తున్న నేపథ్యంలో ఆయన అలకబూనారు. అసలు బెర్త్ ల కన్ఫమ్ పై లీకులు ఎలా వస్తున్నాయ్...అసలు మాపోస్టులకు ఎసరు పెట్టేలా ఎవరు ప్రయత్నిస్తున్నారంటూ తలపట్టుకుంటున్నారు.   

ఈటల రాజేందర్ అంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తెలియని వారు ఉండరు. బలమైన బీసీ సామాజిక వర్గానికి చెందిన ఆయన టీఆర్ఎస్ పార్టీలో సీనియర్ నేతగా గుర్తింపు పొందారు. బీసీలను ఐక్యం చేసి టీఆర్ఎస్ పార్టీవైపు మెుగ్గు చూపేలా కృషి చెయ్యడంలో ఈటల రాజేందర్ దిట్ట అంటూ రాజకీయ వర్గాలు చెప్తుంటాయి.  

తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ కు వెన్నుదన్నుగా నిలిచారు ఈటల రాజేందర్. టీఆర్ఎస్ పార్టీ ఏర్పడినప్పటి నుంచి ఆ పార్టీలో కీలకంగా పనిచేశారు. టీఆర్ఎస్ పార్టీలో కూడా ఆయనకు అంతే ప్రాధాన్యత ఉంది. 

తెలంగాణ ఉద్యమంలో అనేక కేసులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా రైల్వే కేసులు ఎదుర్కొన్నారు. ఇప్పటికి ఆయన పలు కేసులను ఎదుర్కొంటున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 

టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈటల రాజేందర్ కు కేసీఆర్ సుముచిత స్థానం ఇచ్చారు. కీలకమైన ఆర్థిక శాఖ కట్టబెట్టారు. ఆర్థిక శాఖ మంత్రిగా ఈటల సమర్థవంతంగా పనిచేశారని కేసీఆర్ స్వయంగా ప్రకటించారు కూడా. 

2018 ముందస్తు ఎన్నికల్లోనూ ఈటల రాజేందర్ హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. ప్రజా ఆశీర్వాద సభలో రాజేందర్ ను గెలిపించే బాధ్యత మీది మంచి పదవి ఇచ్చే బాధ్యత నాది అంటూ కేసీఆర్ హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ మంత్రి వర్గంలో మెుదటి ఐదు పేర్లలో తన పేరు ఉంటుందని ఈటల ధీమా వ్యక్తం చేశారు. 

ఈసారి కూడా తనకు ఆర్థిక శాఖ కన్ఫమ్ అని ఈటల రాజేందర్ తోపాటు ఆయన అనుచరులు, అభిమానులు ఆశపడ్డారు. కానీ మంత్రి వర్గం రోజురోజుకు ఆలస్యం అవుతుండటంతో పలు లీకులు వస్తున్న సందర్భంలో ఈటల అలకబూనినట్లు తెలుస్తోంది. ఈసారి ఈటలకు కేబినెట్ లో బెర్త్ ఉండదని, స్పీకర్ పదవి కట్టబెడతారంటూ ప్రచారం జరుగుతుంది. 

ప్రచారానికి తగ్గట్టుగానే మంత్రి వర్గం లేట్ అవుతుండటం వస్తున్న లీకులతో ఈటల రాజేందర్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. స్పీకర్ పదవి అంటేనే ఆయన సున్నితంగా తిరస్కరిస్తున్నారు. తెలంగాణలో అసెంబ్లీ స్పీకర్ గా మధుసూదనాచారి పనిచేశారు. 

ఆయన ఈ ఎన్నికల్లో ఓటమి చెందడంతో ఆయన స్థానాన్ని ఎవరికి కట్టబెట్టాలన్న ఆలోచన వచ్చినప్పుడు ఈటల రాజేందర్ పేరును అధిష్టానం తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది. అయితే స్పీకర్ పదవిపై ఈటల పెదవి విరుస్తున్నారు. అందుకు బలమైన కారణం కూడా ఉంది. స్పీకర్ పదవికి ఒక సెంటిమెంట్ ఉంది. 

ఆ సెంటిమెంట్ మధుసూదనా చారి కొంపముంచిందంటూ చర్చ జరుగుతోంది. ఒకసారి స్పీకర్ కుర్చీలో కూర్చున్న వారు రెండోసారి గెలిచిన దాఖలాలు లేవట. ఈ సెంటిమెంట్ తో ప్రజాప్రతినిధులు స్పీకర్ పదవిని అధిరోహించేందుకు ముందుకు రాని పరిస్థితి. సెంటిమెంట్  నేపథ్యంలో ఈటల, ఆయన అభిమానులు సైతం స్పీకర్ పదవిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 
 
కేసీఆర్ కు అత్యంత విధేయుడుగా ఉన్న ఈటల రాజేందర్ అయితే  స్పీకర్ పదవికి అర్హుడంటూ కొందరు సూచిస్తున్నారట. ఈటల, కేసీఆర్ మాటను ధిక్కరించలేరని, ఆయన ఏది చెప్పినా శిరసా వహిస్తారని ప్రచారంలో ఉంది. అందుకే ఈటల పేరును అధిష్టానమే లీకు చేసిందనే వాదన కూడా బలంగా వినిపిస్తోంది.
 
లీకులతో అసంతృప్తిగా ఉన్న ఆయన నియోజకవర్గానికే పరిమితమయ్యారు. కీలకమైన మంత్రివర్గ కూర్పు సమయంలో హైదరాబాద్‌లో హాట్ హాట్ గా చర్చలు జరుగుతున్న తనకేమీ పట్టనట్లు ఈటల మాత్రం నియోజకవర్గంలో కృతజ్ఞత సభలలో మునిగిపోయారు. 

కృతజ్ఞత సభలు, విజయోత్సవ ర్యాలీలో బిజీబిజీగా ఉన్న ఈటలను మంత్రి వర్గం కూర్పుపై ప్రశ్నిస్తే కేసీఆర్ నిర్ణయమే ఫైనల్ అని ఎవరికి ఏ పదవి ఇవ్వాలో ఆయనకు బాగా తెలుసునని చెప్పుకొస్తున్నారట.  

కేసీఆర్ నిర్ణయమే ఫైనల్ అని ఆయన ఏ పదవి ఇచ్చినా తీసుకుంటానని చెప్పుకొస్తున్నారట. పైకి అలా మాట్లాడుతున్న లోలోన మాత్రం ఆవేదనతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈటలకు స్పీకర్ పదవి అంటూ వస్తున్న లీకుల పట్ల కూడా బీసీ వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. 

ఈలకు మంత్రివర్గంలో సముచిత స్థానం కల్పిస్తారని వారంతా ఆశగా ఎదురుచూస్తున్నారు. కేవలం ఇవన్నీ ఊహాగానాలేనని అయితే కేసీఆర్ నోటి వెంట వచ్చేదే ఫైనల్ అని సర్దుకుపోతున్నారు. అయితే ఈటల రాజేందర్ కు కేసీఆర్ ఎలాంటి స్థానం కల్పిస్తారో అని సర్వత్రా ఆసక్తి నెలకొంది.  

click me!