huzurabad by election: పార్టీల ఆశలపై నీళ్లు.. ఇప్పట్లో హుజురాబాద్ ఉపఎన్నిక లేనట్లే, ఈసీ సంచలనం

By Siva KodatiFirst Published Sep 4, 2021, 2:51 PM IST
Highlights

తెలంగాణలో పొలిటికల్ హీట్‌ను పెంచిన హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నిక తో పాటు ఏపీలోని బద్వేల్ ఉప ఎన్నికలను వాయిదా వేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన వెలువరించింది. అయితే ఈ నెల 30న బంగాల్‌లోని భవానీపూర్‌, జంగీపూర్‌, శంషేర్‌గంజ్‌ స్థానాలకు మాత్రం ఎన్నికలు నిర్వహించనున్నట్లు సీఈసీ వెల్లడించింది

దేశంలో కరోనా మూడో దశ  హెచ్చరికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో పొలిటికల్ హీట్‌ను పెంచిన హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నిక తో పాటు ఏపీలోని బద్వేల్ ఉప ఎన్నికలను వాయిదా వేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన వెలువరించింది. హుజరాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నిక, బద్వేల్ తో పాటు పశ్చిమ బెంగాల్లో మూడు స్థానాలు ఒరిస్సాలో ఒక స్థానం మినహా అన్ని రాష్ట్రాల్లో ఎన్నికలను వాయిదా వేయాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది. దీనితో హుజురాబాద్ ఉప ఎన్నికల విషయంలో కాస్త ఉత్కంఠ తగ్గింది.

కరోనా మహమ్మారి పరిస్థితులు చక్కబడ్డాక, పండుగల సీజన్ ముగిశాక ఉప ఎన్నికలపై నిర్ణయం తీసుకుంటామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అయితే హుజూరాబాద్ నియోజకవర్గం లో ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం జోరుగా చేస్తున్న సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో హుజురాబాద్‌లో.. వైసీపీ ఎమ్మెల్యే హఠాత్తుగా మరణించడంతో బద్వేల్‌లో ఉప ఎన్నిక వచ్చింది. 

అయితే ఈ నెల 30న బంగాల్‌లోని భవానీపూర్‌, జంగీపూర్‌, శంషేర్‌గంజ్‌ స్థానాలకు మాత్రం ఎన్నికలు నిర్వహించనున్నట్లు సీఈసీ వెల్లడించింది. అదే రోజున ఒడిశాలోని పిప్లి అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నట్లు తెలిపింది. ఈ నాలుగు స్థానాల్లో ఉపఎన్నికలకు సంబంధించి సెప్టెంబర్ 6న నోటిఫికేషన్ విడుదల కానుంది. అలాగే నామినేషన్ల దాఖలుకు చివరి తేదీగా సెప్టెంబర్ 13 నిర్ణయించారు. సెప్టెంబర్ 30న పోలింగ్, అక్టోబర్ 3న కౌంటింగ్ నిర్వహిస్తామని ఈసీ తెలిపింది. 

click me!