దుబ్బాక ఉప ఎన్నిక: చంద్రబాబు పేరెత్తిన మంత్రి హరీష్ రావు

By telugu teamFirst Published Oct 19, 2020, 8:10 AM IST
Highlights

దుబ్బాక ఉప ఎన్నికలో కాంగ్రెసు, బిజెపిలపై విమర్శలు గుప్పిస్తూ తెలంగాణ మంత్రి హరీష్ రావు టీడీపీ అధినేత చంద్రబాబు పేరు ప్రస్తావించారు. ప్రజలు చంద్రబాబుకు మీటర్లు పెట్టారని హరీష్ రావు వ్యాఖ్యానించారు.

సిద్ధిపేట: దుబ్బాక ఉప ఎన్నికల్లో తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి పేరు ఎత్తి బిజెపిపై విమర్శల జల్లు కురిపించారు. ఆదివారంనాడు జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన కాంగ్రెసు, బిజెపిలపై తీవ్రమైన విమర్శలు చేసారు. ఆ సందర్బంలోనే చంద్రబాబు పేరు ఎత్తారు.

బిజెపి, కాంగ్రెసులు చేస్తున్న అబద్ధపు ప్రచారాలను రేపటి నుంచి ఎల్ఈడీ స్క్రీన్ పెట్టి ఊరూరా ప్రాచరం చేస్తామని చెప్పారు. వెనుకట చంద్రబాబు మీటర్లు పెడుతానంటే ప్రజలంతా ఆయనకు మీటర్లు పెట్టారని ఆయన అన్నారు. ఇప్పుడు కేంద్రంలోని బిజెపికి కూడా అదే విధంగా మీటర్లు పెడుతారని ఆయన వ్యాఖ్యానించారు. 

బిజెపి కార్యకర్తలే కేంద్రం ప్రవేశపెట్టే మీటర్ల బిల్లును వ్యతిరేకించారని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెసు, బిజెపిలు గోబెల్స్ ప్రచారంతో ఓట్లు అడుగుతున్నాయని ఆయన అన్నారు. దుబ్బాక గడ్డపై బిజెపికి పరాభవం తప్పదని, ఆ పార్టీకి డిపాజిట్ కూడా దక్కదని హరీష్ రావు అన్నారు. 

తెలంగాణలో జరిగే అభివృద్ధిని అడ్డుకోవాలని ప్రతిపక్షాలు ప్రయత్నాలు చేస్తున్నాయని ఆయన అన్నారు. వారికి ప్రజలు ఓటు ద్వారానే బుద్ధి చెప్పాలని అన్నారు. 

దుబ్బాక మండల కేంద్రంలో మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఫరూక్ హుస్సేన్ నిర్వహించిన సమావేశంలో హబ్సీపూర్, ధర్మాజిపేట గ్రామాలకు చెందిన దాదాపు రెండు వందల మంది బిజెపి, కాంగ్రెసు కార్యకర్తలు టీఆర్ఎస్ లో చేరారు. 

దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగా రెడ్డి సతీమణి సుజాత టీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తుండగా, కాంగ్రెసు తరఫున చెరుకు శ్రీనివాస రెడ్డి, బిజెపి తరఫున రఘునందన్ రావు పోటీ చేస్తున్నారు.

click me!