అప్పు తీర్చటం కోసం: యజమానులను చంపి, దోచుకున్న డ్రైవర్

By Siva KodatiFirst Published Jun 18, 2019, 11:40 AM IST
Highlights

డబ్బు కోసం యజమానులను అత్యంత కిరాతకంగా హత్య చేశాడు డ్రైవర్. వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని హుస్నాబాద్‌కు చెందిన నవరతన్ రెడ్డి (76) , శ్రీలత రెడ్డి (72) దంపతులు పటాన్ చెరువులో ఉంటున్నారు

డబ్బు కోసం యజమానులను అత్యంత కిరాతకంగా హత్య చేశాడు డ్రైవర్. వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని హుస్నాబాద్‌కు చెందిన నవరతన్ రెడ్డి (76) , శ్రీలత రెడ్డి (72) దంపతులు పటాన్ చెరువులో ఉంటున్నారు.

వీరి వద్ద సతీశ్ అనే వ్యక్తి గత కొంతకాలంగా డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో వీరు మూడు రోజుల క్రితం సొంతఊరుకు కారులో బయలుదేరారు. దంపతులు నిద్రలోకి జారుకోగానే సతీశ్ కారును ఓ దట్టమైన అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లాడు.

అనంతరం ఇద్దరిని టవల్‌తో గొంతు బిగించి హత్య చేశాడు. అనంతరం మృతదేహాలను కారులో వికారాబాద్ జిల్లా అనంతగిరి అడవుల్లోని మొదటి ఘాట్ వద్దకు తీసుకొచ్చాడు. అక్కడ శ్రీలత రెడ్డి మృతదేహాన్ని, రెండో ఘాట్ నంది విగ్రహం వద్ద నవరతన్ రెడ్డి బాడీని పడేశాడు.

ఎవరు గుర్తు పట్టకుండా ముఖాలపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ క్రమంలో ప్రతి రోజు తల్లిదండ్రులతో ఫోన్‌లో మాట్లాడే పిల్లలకు.. ఆ రోజు వారి ఫోన్లు స్పందించకపోవడంతో బంధువల సాయంతో హుస్నాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

రంగంలోకి దిగిన హుస్నాబాద్ పోలీసులు ముందుగా కారు డ్రైవర్ సతీశ్‌ను అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. దర్యాప్తులో పోలీసులు అసలు నిజాలు రాబట్టారు. 30 వేల నగదు, నగల కోసం కారు డ్రైవర్ సతీశ్ మరో వ్యక్తితో కలిసి దంపతులను హత్య చేసినట్లు నేరాన్ని అంగీకరించాడు.

దీంతో వికారాబాద్ పోలీసుల సహకారంతో కర్ణాటక పోలీసులు మృతదేహాలను గుర్తించారు. తాను అప్పుల ఊబిలో కూరుకుపోయానని.. అప్పు తీర్చేందుకు వేరే దారిలేక ఈ పనిచేశానని అన్నాడు. సతీశ్ అతనికి సహకరించిన రాహుల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. 

click me!