కరోనా వచ్చిందని తనతో ఎవరూ మాట్లాడడం లేదనే మనోవేదనతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటు చేసుకొంది.
చౌటుప్పల్: కరోనా వచ్చిందని తనతో ఎవరూ మాట్లాడడం లేదనే మనోవేదనతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటు చేసుకొంది. జిల్లాలోని చౌటుప్పల్ మండలం జైకేసారం గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి భార్య , పదేళ్ల కొడుకు ఉన్నాడు. పది రోజుల క్రితం ఈ ముగ్గురికి కరోనా లక్షణాలు కన్పించాయి. అయితే పరీక్షలు చేయించుకొంటే నెగిటివ్ వచ్చింది. రెండుసార్లు పరీక్షలు చేయించుకొన్నా పరీక్షల్లో కరోనా నిర్ధారణ కాలేదు.
కరోనా వచ్చిందని బాధితుడితో గ్రామస్తులు ఎవరూ మాట్లాడడం లేదు. దీంతో ఆయన మనోవేదనకు గురయ్యాడు. మంగళవారం నాడు తీవ్రమైన దగ్గు, ఆయాసం రావడంతో బుధవారం నాడు తెల్లవారుజామున ఆయన బయటకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లాడు. తన ఇంటికి సమీపంలోని వ్యవసాయబావి వద్దకు వెళ్లి చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు అతడిని చౌటుప్పల్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో అతడిని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్టుగా తెలిపారు. ఆత్మహత్య చేసుకొన్న వ్యక్తి లారీ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. మృతుడి భార్య, కొడుకు హోం ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారు.