
భద్రాద్రి రామయ్య కల్యాణంపై వివాదం నెలకొంది. పురాతన సంప్రదాయాలు, అలావాట్లకు భిన్నంగా కల్యాణం నిర్వహిస్తున్నారంటూ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. సీతారాముల కల్యాణ సమయంలో కొత్త పద్దతులు ఉపయోగిస్తున్నారని ఆ పిటిషన్ లో పేర్కొన్నారు.
స్వామి వారి కల్యాణం జరిపించే సమయంలో శ్రీరామచంద్రప్రభు అనడానికి బదులుగా శ్రీ రామన్నారాయణ అని ఉచ్చరిస్తున్నారని అన్నారు. ఇది సంప్రదాయాలకు విరుద్ధం అన్నారు. ఇలా కొత్త పదాలు ఉచ్చరిస్తూ కల్యాణం నిర్వహిస్తుంటే ఆలయ ప్రధాన అర్చకుడు అడ్డుచెప్పడం లేదని ఆ రిట్ లో పిటిషనర్లు పేర్కొన్నారు.
హైదరాబాద్ పట్టణానికి చెందిన వెంకటరమణ అనే వ్యక్తి ఈ రిట్ ను దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ ఎ.అభిషేక్‌రెడ్డి విచారణ జరిపారు. అయితే పిటిషనర్ వాదనలు విన్న న్యాయమూర్తి దీనిపై ఇప్పుడే ఒక నిర్ణయానికి రాలేమని అన్నారు. ఇప్పుడే మధ్య ఉత్తర్వులు జారీ చేయబోమని తెలిపారు. ఈ విషయంలో ఆలయ అధికారుల వాదనలు వినాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఆ తరువాతే దీనిపై సరైన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. తదుపరి విచారణను ఏప్రిల్ 20వ తేదీకి వాయిదా వేస్తున్నానని పేర్కొన్నారు.