తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంపై మరోసారి విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ . తెలంగాణలో బై బై కేసీఆర్ నినాదం నడుస్తోందని ఆయన ఎద్దేవా చేశారు. ఈడీ, ఐటీలు కేసీఆర్ దరిదాపుల్లోకి కూడా వెళ్లడం లేదన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంపై మరోసారి విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా జడ్చర్లలో జరిగిన కాంగ్రెస్ కార్నర్ మీటింగ్‌లో ఆయన ప్రసంగించారు. దోపిడీ జరగడానికి వీలున్న శాఖలన్నీ కేసీఆర్ వద్దే వున్నాయని రాహుల్ ఎద్దేవా చేశారు. ప్రాజెక్ట్‌ల్లో దోపిడీ జరిగిందని.. అన్నింటికంటే పెద్ద దోపిడీ ధరణీ పోర్టల్ ద్వారా జరిగిందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రజల సొమ్మును తిరిగి ఇప్పిస్తామని ఆయన పేర్కొన్నారు. ఏ శాఖలో ఎక్కువగా చోరీ చేసే అవకాశం వుందో మీ అందరికీ తెలుసునని రాహుల్ అన్నారు. ఇన్ని శాఖలున్నా వారి అవినీతికి అంతం లేకుండా పోయిందని ఆయన మండిపడ్డారు.
పార్లమెంట్‌లో రైతు చట్టాలు, జీఎస్టీ సహా బీజేపీ ప్రవేశపెట్టిన అన్ని బిల్లులకు బీఆర్ఎస్ మద్ధతిచ్చిందని రాహుల్ దుయ్యబట్టారు. కంప్యూటరైజేషన్ పేరుతో ధరణి పోర్టల్‌లో భారీగా దోపిడీ జరిగిందని ఆయన ఆరోపించారు. లిక్కర్, భూమి, ఇసుకలో ఎక్కువ దోపిడీ జరుగుతుందని రాహుల్ చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద కట్టిన వంతెనలన్నీ కూలిపోతున్నాయని ఆయన చురకలంటించారు. బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం కలిసి పనిచేస్తున్నాయని రాహుల్ గాంధీ దుయ్యబట్టారు. ఇందిరమ్మ ఇల్లు స్కీములో భాగంగా ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షలు ఇస్తామని రాహుల్ తెలిపారు.
undefined
కేసీఆర్ హయాంలో జరిగిన కాళేశ్వరం, ధరణి పోర్టల్‌లో అక్రమాల లెక్క లేలుస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణ మధ్యే పోటీ అని రాహుల్ అభివర్ణించారు. ఓ వైపు సీఎం, సీఎం కుటుంబం, మంత్రులు వుంటే.. ఇంకో వైపు పేదలు, నిరుద్యోగులు, సామాన్య ప్రజలున్నారని ఆయన చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మహిళలకు రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని రాహుల్ పేర్కొన్నారు. కూలిపోతున్న బ్యారేజీలను కేసీఆర్ పరిశీలించాలని ఆయన డిమాండ్ చేశారు. కాళేశ్వరంలో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని రాహుల్ గాంధీ ఆరోపించారు.
అధికారంలోకి రాగానే ప్రజల సొమ్మును ప్రజలకు తిరిగి ఇప్పిస్తామని ఆయన పేర్కొన్నారు. బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం కలిసే పనిచేస్తున్నాయని ఆయన ఆరోపించారు. బీజేపీ, బీఆర్ఎస్‌లు ఓబీసీలకు ప్రాధాన్యత ఇచ్చేందుకు ఇష్టపడటం లేదని రాహుల్ గాంధీ దుయ్యబట్టారు. 2024లో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే దేశమంతా ఓబీసీ జనగణన నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణలోనూ ఓబీసీ జనగణన నిర్వహిస్తామని రాహుల్ గాంధీ వెల్లడించారు. ప్రధాని మోడీ గురించి మాట్లాడితే నా ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేశారని .. తన ఇంటిని కూడా స్వాధీనం చేసుకున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేసీఆర్ ఇంటి వైపు దర్యాప్తు సంస్థలు ఎందుకు వెళ్లడం లేదని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. తెలంగాణలో బై బై కేసీఆర్ నినాదం నడుస్తోందని ఆయన ఎద్దేవా చేశారు. ఈడీ, ఐటీలు కేసీఆర్ దరిదాపుల్లోకి కూడా వెళ్లడం లేదన్నారు. తెలంగాణలో 2 శాతం ఓట్లు కూడా లేని బీజేపీ ఓబీసీని ఎలా సీఎంని చేస్తుందని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. తెలంగాణలో బీజేపీ నేతలు రొమ్మలు విరుచుకుని తిరిగేవారని.. కానీ కాంగ్రెస్ నేతలు వారి గాలి తీసేశారని ఆయన చురకలంటించారు. ఎక్కడెక్కడ కాంగ్రెస్ పోటీ చేస్తుందో అక్కడికి ఎంఐఎం వస్తోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. తెలంగాణలో ఎలా అయితే పంక్చర్ చేశామో .. త్వరలోనే దేశమంతా బీజేపీ గాలి తీసేస్తామని రాహుల్ హెచ్చరించారు.