కాంగ్రెస్ ఎప్పుడూ రైతుల సంక్షేమం గురించే ఆలోచిస్తుందన్నారు ఆ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ. ఓబీసీని ముఖ్యమంత్రిని చేస్తామని బీజేపీ ఇప్పుడు చెబుతోందని.. రెండు శాతం ఓట్లు పడే బీజేపీ , ఓబీసీని ముఖ్యమంత్రిగా ఎలా చేస్తుందని ఆయన ప్రశ్నించారు.
కాంగ్రెస్ ఎప్పుడూ రైతుల సంక్షేమం గురించే ఆలోచిస్తుందన్నారు ఆ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా షాద్ నగర్ లో బుధవారం నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో ఆయన ప్రసంగిస్తూ.. రైతుభరోసా కింద రైతులకు ఎకరానికి ఏటా రూ.15 వేలు ఇస్తామని, కౌలు రైతులకు కూడా దీనిని వర్తింపజేస్తామని రాహుల్ హామీ ఇచ్చారు. వృద్ధులు, వితంతువులకు ప్రతినెలా రూ.4 వేల పింఛను ఇస్తామని ఆయన తెలిపారు.
రాష్ట్రాభివృద్ధి కోసం మహిళలు ఎంతో కష్టపడుతున్నారని, రాష్ట్రం కోసం , కుటుంబం కోసం కష్టపడే మహిళలకు న్యాయం జరగాలని రాహుల్ గాంధీ ఆకాంక్షించారు. అందుకే మహిళలకు ప్రతినెలా రూ.2500 ఖాతాల్లో వేస్తామని ఆయన పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గ్యాస్ సిలిండర్‌ను రూ.వెయ్యికి పెంచిందని రాహుల్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ గెలిస్తే.. రాష్ట్రంలో రూ.500కే గ్యాస్ సిలిండర్ వస్తుందని ఆయన హామీ ఇచ్చారు.
కాంగ్రెస్ గెలిస్తే మహిళలందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని రాహుల్ గాంధీ వెల్లడించారు. ఉచిత బస్సు ప్రయాణం ద్వారా మహిళలకు నెలకు రూ.2 వేల వరకు ఆదా అవుతుందని ఆయన పేర్కొన్నారు. భూమిలేని రైతులకు ఏడాదికి రూ.12 వేలు ఇస్తామని.. మోడీ , కేసీఆర్ ప్రభుత్వాలు రైతులను ఎన్నో ఇబ్బందులు పెట్టాయని రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ, కేసీఆర్ కలిసి విద్యారంగంలో ప్రైవేట్ వాళ్లనే ఎక్కువగా ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు.
ALso Read: తెలంగాణలో బైబై కేసీఆర్ నినాదం మొదలు .. బీఆర్ఎస్ దోపిడీని కక్కిస్తాం , మొత్తం ప్రజలకే : రాహుల్ గాంధీ
కోచింగ్ సెంటర్లకు వెళ్లి తెలంగాణ యువత లక్షల రూపాయలు చెల్లిస్తున్నారని రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్ధుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక పథకం తీసుకురానుందని ఆయన హామీ ఇచ్చారు. యువ వికాసం కింద రూ.5 లక్షలతో కూడిన క్రెడిట్ కార్డు ఇస్తామని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. కాంగ్రెస్ ఇచ్చే కార్డుతో విద్యార్ధులు కాలేజ్ ఫీజు, కోచింగ్ ఫీజు చెల్లించుకోవచ్చని తెలిపారు. బీజేపీ విషం చిమ్మితే నేను మాత్రం ప్రేమను పంచుతానని రాహుల్ పేర్కొన్నారు.
మోడీని ప్రశ్నించినందుకు తనపై 24 కేసులు పెట్టారని.. తనకు ఇచ్చిన ప్రభుత్వ బంగ్లాను కూడా తీసుకున్నారని ఆయన ధ్వజమెత్తారు. మీ ఇల్లు వద్దు అని ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేసి వచ్చానని.. దేశంలోని ప్రజలందరి గుండెల్లో నాకు చోటు వుందని చెప్పి వచ్చానని రాహుల్ పేర్కొన్నారు. ఓబీసీని ముఖ్యమంత్రిని చేస్తామని బీజేపీ ఇప్పుడు చెబుతోందని.. రెండు శాతం ఓట్లు పడే బీజేపీ , ఓబీసీని ముఖ్యమంత్రిగా ఎలా చేస్తుందని ఆయన ప్రశ్నించారు.