కేసీఆర్ వల్లే తెలంగాణకు అన్యాయం, ఐదేళ్లు మోదీ భజన చేసినా...: బడ్జెట్ పై ఎంపీ కోమటిరెడ్డి

By Nagaraju penumalaFirst Published Jul 5, 2019, 4:55 PM IST
Highlights

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యంతోనే బడ్జెట్‌లో అన్యాయం జరిగిందంటూ కోమటిరెడ్డి ధ్వజమెత్తారు. వ్యక్తిగత కారణాల వల్లనే సీఎం కేసీఆర్ కేంద్రంపై ఒత్తిడి తేలేకపోతున్నారని విమర్శించారు. గత ఐదేళ్లుగా తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రధాని నరేంద్రమోదీ భజన చేశారని అయినా రాష్ట్రానికి ఏమీ ఇవ్వలేదని విమర్శించారు.  
 
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ పై టీ  కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రం బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరగడానికి సీఎం కేసీఆరే కారణమని ఆరోపించారు. 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యంతోనే బడ్జెట్‌లో అన్యాయం జరిగిందంటూ కోమటిరెడ్డి ధ్వజమెత్తారు. వ్యక్తిగత కారణాల వల్లనే సీఎం కేసీఆర్ కేంద్రంపై ఒత్తిడి తేలేకపోతున్నారని విమర్శించారు. గత ఐదేళ్లుగా తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రధాని నరేంద్రమోదీ భజన చేశారని అయినా రాష్ట్రానికి ఏమీ ఇవ్వలేదని విమర్శించారు.  

కేంద్ర బడ్జెట్ అంత ఆశాజనకంగా లేదన్న ఆయన రైతుల గురించి కనీసం పట్టించుకోలేదని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టాల ప్రస్తావన కనుచూపు మేరలో కనిపించలేదన్నారు. కేంద్ర బడ్జెట్‌ తెలంగాణ రాష్ట్ర వ్యతిరేక బడ్జెట్‌గా కోమటిరెడ్డి అభివర్ణించారు.  
 
తెలంగాణ రాష్ట్రంలోని గిరిజన విశ్వవిద్యాలయం, గేమ్స్‌కు నిధులు కేటాయించలేదని మండిపడ్డారు. కాళేశ్వరానికి జాతీయ హోదా, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ గురించి బడ్జెట్‌లో ప్రస్తావించలేదని ఎంపీ కోమటిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మరోవైపు ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటాయని మళ్లీ ధరలు పెంచడం సరికాదన్నారు. పెట్రోధరలు పెరగడం వల్ల అన్ని వస్తువుల ధరలపై ప్రభావం చూపే అవకాశం ఉందని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అభిప్రాయపడ్డారు.  

click me!